వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారం చేపట్డం ఖాయమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైకాపా పాలన బాగుంటే రోడ్ల మీదకు వచ్చేవాళ్లం కాదన్న పవన్.. అర్హులు అందరికీ పింఛన్లు, పోలీసులకు టీఏలు, డీఏలు అందడం లేదని వ్యాఖ్యానించారు. కొందరు రెడ్ల వల్ల ఆ సామాజికవర్గంలోని అందరికీ చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని. కులాలు, మతాలకు అతీతంగా అండగా ఉంటాను. రాయలసీమ నుంచి ఎందరో యువత వలస పోతున్నారు. రాయలసీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు. భయపెడితే పరిశ్రమలు ఎక్కణ్నుంచి వస్తాయి?. రాయలసీమకు పరిశ్రమలు రప్పిస్తా.. అభివృద్ధి చేస్తా. సాయిబాబా ఒక్కరే అంత పని చేస్తే.. ప్రభుత్వం ఎంత చేయాలి?. వచ్చిన కియా పరిశ్రమను కూడా బెదిరించారు. నాయకుడు నిజాయతీగా ఉంటే అందరికీ అభివృద్ధి ఫలాలు వస్తాయి.
-పవన్ కల్యాణ్, జనసేన అధినేత.
ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదు..
రాయలసీమ పోరాటాలు, పౌరుషాల గడ్డ అని పవన్ కల్యాణ్ అన్నారు. రాయలసీమ చదువుల సీమ అని, కానీ ఇప్పటికీ ఈ ప్రాంతం వెనకబడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదన్న పవన్.. రాయలసీమలో జనసేన మార్పు తీసుకొచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. తాము వస్తున్నామని తెలిసి పుట్టపర్తిలో 5 రోజుల్లో రోడ్లు వేశారని పవన్ వ్యాఖ్యానించారు. మనం భయపడిన కొద్దీ ఎదుటి వారు భయపెడుతూనే ఉంటారన్న పవన్.. ఎదురుతిరిగితే వారే దారికొస్తారని సూచించారు.
బోయ కులంలోని పేదల కష్టాలను జనసేన గుర్తిస్తుంది. నేను నెల్లూరు జిల్లాలో చదువుకున్నా.. రెడ్డి సామాజికవర్గంతో కలిసి పెరిగాను. గ్రామానికి, సంగ్రామానికి ఎంతో దూరం లేదు. రాయలసీమలో జనసేన మార్పు తీసుకొచ్చి తీరుతుంది. రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెడతాం. పోరాడేందుకు తెదేపా కూడా వెనుకంజ వేస్తోంది.
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత.
కుటుంబాన్ని వదిలి వచ్చాను...
వైకాపా మంత్రులు, నేతలతో మనకు గొడవలు వద్దన్న పవన్... కోపాన్ని గుండెల్లో దాచుకుని, సమయం వచ్చినప్పుడు చూపించాలని సూచించారు. వైకాపాతో ఇబ్బందిగా ఉందని అనేకమంది రెడ్ల నేతలే చెప్పారని పవన్ తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు కోసమే పోరాడతానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక్కమాట చెబితే ధవళేశ్వరం, పుట్టపర్తిలో రోడ్లు వేశారని చెప్పారు. ప్రజల కోసం కుటుంబాన్ని వదిలి వచ్చానని పవన్ కల్యాణ్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన జెండా రెపరెపలాడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అనుబంధ కథనాలు...