Jagan promises to farmers: అనంతపురం జిల్లా గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గ రైతులకు సాగునీరిస్తామన్న హామీ నెరవేరలేదు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి రాగులపాడు వద్ద ఉప కాలువ తవ్వి 2300 ఎకరాలకు కృష్ణా జలాలు ఇస్తామన్న హామీ నాలుగేళ్లుగా కార్యరూపం దాల్చలేదు. రెండు నియోజకవర్గాల్లో 23 చెరువులు, కుంటలతో పాటు నాలుగు చెక్ డ్యాంలు నింపి, ఆయకట్టుతో పాటు, భూగర్భ జలాలు పెంపొందించాలనేది లక్ష్యం. ఈ కాలువ నిర్మాణానికి గత ప్రభుత్వంలో డీపీఆర్ సిద్దం చేసి ప్రతిపాదనలు పంపించారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏడాది పాటు దీన్ని పట్టించుకోలేదు. 2020లో జలవనరులశాఖ అధికారులు మరోసారి ఈ ప్రతిపాదనలపై గుర్తు చేస్తూ 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తే పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని కోరారు. అయితే గుత్తేదారుతో అగ్రిమెంట్ పూర్తైందే తప్ప కాలువ నిర్మాణానికి రైతులకు పరిహారం పంపిణీ చేయలేదు, కాలువ పనులు ప్రారంభించలేదు.
హంద్రీనీవాకాలువ నుంచి వచ్చే కృష్ణా జలాలను ఎంతమేరకైనా వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయటంలేదు. ప్రధాన కాలువ ప్రారంభమయ్యే కర్నూలు జిల్లా ముచ్చుమర్రి నుంచి ప్రవాహ సామర్థ్యం పెంచి పది వేల క్యూసెక్కుల నీటిని తెస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలో చూపించలేకపోయింది. శ్రీశైలం ప్రాజక్టు బ్యాక్ వాటర్‌ను రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు మరింతగా నీటిని తరలించేలా టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రణాలికను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది.
నాలుగేళ్ల క్రితమే సర్వే..హంద్రీనీవా కాలువ కర్నూలు జిల్లాలో నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే సరిహద్దులో ప్రధాన కాలువపై రాగులపాడు వద్ద ఎత్తి పోస్తున్నారు. అక్కడి నుంచి 19 కిలోమీటర్లు కాలువ తవ్వి గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల రైతులకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే విధంగా మార్గమధ్యలో తాగునీటి పథకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాడుకునేలా డిజైన్ చేశారు. నాలుగేళ్ల క్రితమే కాలువ కోసం సర్వే చేసి 228 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని డీపీఆర్ సిద్ధం చేసి గత ప్రభుత్వానికి పంపారు. దీన్ని ఆమోదించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలువ నిర్మాణానికి నిధులు మాత్రం విడుదల చేయలేదు, రైతులకు పరిహారం ఊసెత్తటంలేదు. ఈ కాలువ వస్తే చాలా ప్రయోజనం ఉందని రైతులు చెబుతున్నారు.
గత ప్రభుత్వ ప్రతిపాదనలు ఒప్పుకున్నా..హంద్రీనీవా ఉపకాలువ ద్వారా అర టీఎంసీల నీటిని తరలించి 27 చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపాలని ప్రతిపాదించారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఏడు చెరువులు, కుంటలు, ఉరవకొండ నియోజకవర్గంలో ఏడు చెరువులు, నాలుగు కుంటలతోపాటు, రెండు నియోజకవర్గాల్లో నాలుగు చెక్ డ్యాంలకు మళ్లించాలనేది ప్రతిపాదన. ఈ నీటిని నిల్వచేయటం ద్వారా చెరువులు, కుంటల నుంచి 2300 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక చేశారు. 19 కిలోమీటర్ల కాలువ పొడవునా తాగునీటి పథకాలకు కృష్ణా జలాలను వాడుకునేలా డీపీఆర్‌లో చెప్పారు. చెక్ డ్యాంలు, కుంటల ద్వరా భూగర్భ జలాలు పెంపొందేలా ప్రణాళిక చేశారు. రైతుల నుంచి సేకరించిన భూమికి పరిహారం ఇవ్వటానికి, కాలువ నిర్మాణానికి గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంది.
గాల్లో కలిపిన ప్రతిపాదనలు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రతిపాదనలు పట్టించుకోకపోవటంతో.. అనంతపురం జిల్లా జలవనరులశాఖ అధికారులు 2020లో మరోసారి ప్రభుత్వానికి గుర్తుచేశారు. 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తే పరిహారం ఇచ్చి పనులు ప్రారంభిస్తామని నివేదించారు. ప్రభుత్వం గుత్తేదారుతో 40.50 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ కాలువ వస్తే చాలా ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా దుర్భిక్ష ప్రాంత రైతులకు మేలు చేసేలా ఈ కాలువ నిర్మాణం చేపట్టి చెరువులు నింపి సాగునీరివ్వాలని గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల రైతులు కోరుతున్నారు.
మాటలకే పరిమితమైన జగనన్న హామీ.. నాలుగేళ్లు అయినా మొదలు కాని కాలువ పనులు