హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైపులైను ఏర్పాటుకు సంబంధించిన పరిహారంలో స్థానిక నాయకులు చేతివాటం ప్రదర్శించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న విశ్రాంత రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలు పంటలే సాగు చేయని వారు రూ.లక్షల్లో పరిహారం అందుకున్నారు. ఇందుకు సహకరించిన అధికారులు భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఆ సంస్థ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించడంతో అవినీతికి తెరలేపారు. స్థానిక నాయకులు అన్నీ తామై వ్యవహారాన్ని నడిపారు. ప్రభుత్వ భూములకు పత్రాలు సృష్టించి రూ.లక్షలు స్వాహా చేశారు.
కూడేరులో వెలుగులోకి..
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ కర్ణాటకలోని హసన్ జిల్లా నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌లోని చర్లపల్లి వరకు గ్యాస్ పైపులైన్ ఏర్పాటు చేస్తోంది. సర్వే, పరిహారం పంపిణీ కోసం కొందరు విశ్రాంత రెవెన్యూ అధికారులను నియమించారు. 2019 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. ఈ పైపులైను జిల్లాలోని కంబదూరు, కళ్యాణదుర్గం, కూడేరు, అనంతపురం, గార్లదిన్నె, పామిడి, గుత్తి మండలాల మీదుగా వెళ్తోంది. అత్యధిక భాగం వ్యవసాయ పొలాల మీదుగానే పైపులైన్‌ను తీసుకెళ్తున్నారు. దీంతో పంట నష్టపోయే రైతులకు తగిన పరిహారం ప్రకటించారు. పంట విలువ బట్టి పరిహారం అందిస్తూ వస్తున్నారు. సాధారణ పంటలు ఉన్నచోట సెంటుకు రూ.1400 నుంచి రూ.1500 వరకు చెల్లించారు. చీనీ, నిమ్మ, మామిడి వంటి పండ్ల తోటలకు వయసును బట్టి రూ.8,000 నుంచి రూ.15,000 దాకా ఇచ్చారు. అయితే కూడేరు మండలం కమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌పీసీఎల్‌లో పనిచేసే రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. పొలాల్లో పండ్ల తోటలు లేకపోయినా ఉన్నట్లు రికార్డులో నమోదు చేయించారు. పైపులైను కారణంగా ఒక్క చెట్టు కూడా నష్టపోకపోయినా వందల్లో తొలగించినట్లు రాయించారు. అసలు పొలం లేనివారికి కూడా ఉన్నట్లు, అందులో పంటలు వేసినట్లు సృష్టించారు. రూ.లక్షలు పక్కదారి పట్టించారు.
అర్హులకు అరకొరే..
హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైపులైన్ ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులకు అరకొరగానే పరిహారం అందజేసినట్లు బాధితులు వాపోతున్నారు. సాధారణ పంటలు వేసిన రైతులు కొంతమందికి సెంటుకు రూ.400 నుంచి రూ.500 మాత్రమే ముట్టజెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ ఏర్పాటుతో చాలాచోట్ల బోర్లు వేయడానికి అవకాశం ఉండటం లేదు. భవిష్యత్తులో ఏదైనా అవసరానికి అమ్ముకోవాలంటే సరైన ధర కూడా లభించని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. స్థానిక నాయకులు నకిలీ పత్రాలు సృష్టించి రూ.లక్షల్లో పరిహారం ఇప్పించి అందులో వాటాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
కమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 220 సర్వే నెంబరులో లక్ష్మీదేవి పొలంలో 1.25 ఎకరాలు పైపులైను కోసం సేకరించారు. వీరికి రూ.61 వేలు మాత్రమే నష్ట పరిహారం అందించారు. అదే సర్వే నెంబరులో మాదన్న అనే రైతు 62 సెంట్లు కోల్పోగా రూ.30 వేలు అందజేశారు.