కరోనా దెబ్బకి సగటు జీవి విలవిల్లాడుతున్నాడు. నిత్యావసరాల దృష్ట్యా ప్రభుత్వం రేషన్ ఉచితంగా ఇస్తోంది. మధ్యలో ఉన్న కొందరు డీలర్లు మాత్రం సగానికి సగం నొక్కేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ఒక్కో కార్డుకు 2 నుంచి 3 కిలోల బియ్యం తక్కువ ఇస్తున్నారు. అలాగే కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఇస్తున్నారు. కందిపప్పు 50 కిలోల బస్తాల్లో సరఫరా చేశారు. అడిగేవారులేరని కార్డుకు 200, 300 గ్రాములు చొప్పున నొక్కేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఉచితమే కదా.. ఇచ్చింది తీసుకో.. అంటూ కార్డుదారులపై డీలర్లే తిరగబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పలు దుకాణాలు మూతపడ్డాయి. పలుచోట్ల సరకులు ఇవ్వకుండా తిప్పుకొంటున్నారు.
దోపిడీ పక్కా..
అనంతపురం జిల్లాలో 3,012 చౌక దుకాణాలు, 12,23,780 కార్డులు ఉన్నాయి. వారందరికీ 30 వేలమెట్రిక్ టన్నుల బియ్యం, కందిపప్పు జిల్లాకు కేటాయించారు. కందిపప్పు 1200 మెట్రిక్ టన్నులకు గాను, 900 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. గత మార్చి 29 నుంచి పాత కార్డుల ప్రకారమే ఉచిత సరకులు అందిస్తున్నారు. ఈనెల 4 వరకు పరిశీలిస్తే.. 9.51 లక్షల కార్డులకు ఉచిత సరకులు పంపిణీ చేసినట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల తక్కువ తూకాలు, మరికొన్నిచోట్ల డబ్బాలతో తూకం వేయడంతో కార్డుకు 2 కిలోలపైగా బియ్యం తక్కువ ఇస్తున్నారు.
ఆ లెక్కన 1,902 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లు నొక్కేసినట్లే. వాటి విలువ రూ.5,70,60,000. గతంలో కందిపప్పు ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేవారు. తాజాగా లూజుగా సరఫరా చేశారు. దీంతో చాలామంది డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆ లెక్కన 190 మెట్రిక్ టన్నులు కందిపప్పు బొక్కేసినట్లు అంచనా. మార్కెట్ ధర ప్రకారం రూ.1.71 కోట్లు తినేశారన్న మాట. జిల్లాలో ఎక్కడా పర్యవేక్షణ లేక ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా డీలర్ల తీరు మారింది.
సరకులు స్కేల్‌పై కచ్చితమైన తూకం ఇవ్వాలని డీఎస్‌ఓ శివశంకర్ రెడ్డి చెప్పారు. డబ్బాలతో కాని, తూకాలు తక్కువ ఇస్తే సహించమని తెలిపారు. ఉచిత సరకులైనా ప్రతికార్డుదారునికి కచ్చితమైన తూకం ఇవ్వాల్సిందే.. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే పరిశీలించి డీలరుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.