అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెట్టుఅమాలిక అనే కొత్త రకం చింత మొక్కలను ఆవిష్కరించారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇస్తాయి. గతంలో అనంత రుధిర పేరుతో నూతన రకం చింత మొక్కలను ఈ పరిశోధనా కేంద్రంలో ఆవిష్కరించారు.
ఆరేళ్ల కృషికి ఫలితం
2012 సంవత్సరంలో రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు నటరాజ్, శ్రీనివాసులు చింత చెట్లలో అధిక దిగుబడి ఇచ్చే నూతన రకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరుజిల్లా మదనపల్లె శివారులో ఉన్న తెట్టు అనే గ్రామంలో చింత చెట్ల నమూనాలు తీసుకువచ్చి పరిశోధనలు ప్రారంభించారు. 2012-2018 వరకు పరిశోధనలు చేసి కొత్త రకాన్ని సృష్టించారు. చింత నమూనాలను తెట్టు గ్రామం నుంచి తీసుకురావడంతో ఆ గ్రామం పేరు కలిసేలా తెట్టుఅమాలిక అనే పేరును ఖరారు చేశారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెట్టుఅమాలిక వంగడానికి గుర్తింపు ఇచ్చింది.
‘తెట్టుఅమాలిక’ ప్రత్యేకతలు
*సాధారణంగా చింత మొక్కలు నాటిన ఆరేళ్ల తర్వాత కాయలు కాయడం ప్రారంభిస్తాయి. ఈ రకం మొక్కలు నాటిన మూడేళ్ల నుంచే కాస్తాయి.