అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. 'బాలికే భవిష్యత్' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఒక్కరోజు అధికారులుగా నియమించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం విద్యార్థినుల్లో ఉత్సాహం నింపింది. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని... వాటిని సాకారం చేసుకునే దిశగా బాలికలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల పేర్లు లాటరీ ద్వారా ఎంపిక చేసి... వారికి ఒక్కరోజు అధికార బాధ్యతలు అప్పగించారు. అనంతపురం జిల్లా ఒక్కరోజు కలెక్టర్‌గా గార్లదిన్నె కస్తూర్బా పాఠశాల ఇంటర్ విద్యార్థిని శ్రావణి.... సంయుక్త కలెక్టర్లుగా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు నిర్వహించారు. కలెక్టర్ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ వారిని స్వయంగా ఆహ్వానించారు. దిశ చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు పరిహారం ఇచ్చే ఫైల్ పై ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేశారు.