అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. కొవిడ్ కారణంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో కనీసం పాఠ్యపుస్తకం అందిస్తే ఇంటి వద్దే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకం అందిస్తే ప్రయోజనం చేకూరుతుంది.
పుస్తకాలు అందలేదు
ప్రథమ ఇంటర్‌లో 28, ద్వితీయ ఇంటర్‌లో 28 పాఠ్యపుస్తకాలు అందివ్వాలి. ఇందులో ఇంకా ఆరు రకాల పుస్తకాలు అందలేదు. ముఖ్యమైన పాఠ్యపుస్తకాలే సరఫరా చేయలేదు. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి చరిత్ర పుస్తకాలు 2,331 అవసరం కాగా.. ఒక్కటీ సరఫరా కాలేదు. ఉర్దూ పుస్తకాలదీ అదే పరిస్థితి. ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి పాఠ్యపుస్తకాలు అందిస్తేనే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ ఆంగ్లం పుస్తకాలు 12,805, వృత్తివిద్య 3,129, గణితం-2బి 2,300, భౌతికం 4,144 పుస్తకాలు అవసరం కాగా ఒక్కటీ అందలేదు.