అనంతపురం జిల్లావ్యాప్తంగా పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతున్నా.. పురుగుల ఉద్ధృతితో అల్లాడిపోతున్నారు. జిల్లా అంతటా పదిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ పంటలకు అనేక సమస్యలు వచ్చాయి. పురుగుల ఉద్ధృతి అధికం కావటంతో విచ్చలవిడిగా పురుగు మందులు చల్లుతుండటంతో పెట్టుబడి భారం పెరుగుతోంది. మంచి వర్షాలు కురిసినప్పటికీ ఈసారి పంటలకు చీడ, పీడలు అధికమైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా వర్షాలు విరామం లేకుండా కురుస్తుండటంతో కలుపు తీసే వ్యవధి లేకుండా పోయింది. దీంతో పంటతోపాటు కలుపు పెద్దఎత్తున రావటంతో అన్ని గ్రామాల్లో కూలీల అవసరం పెరిగింది. కూలీలు రాక చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 6.68 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగుచేశారు. వీటిలో సింహభాగం 4.90 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. పది రోజుల నుంచి నిరంతరాయంగా వర్షం కురవటంతో పచ్చపురుగు ఉద్ధృతి పెచ్చుమీరింది. ప్రస్తుతం పచ్చపురుగు, ఆకుపచ్చ తెగులు, వేరుకుళ్లు తెగులుతో వేరుశనగ పంటకు నష్టం చేకూర్చుతోంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి వ్యవసాయశాఖ అధికారులు మందులను సూచిస్తూ గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు. మొక్కజొన్నలోనూ మళ్లీ కత్తెర పురుగు విజృంభిస్తోంది. ఆముదంలో నామాల పురుగు ఆకులను పూర్తిగా తినేస్తోంది. ఇలా బాగా కురిసిన వర్షాలతో పంటలకు ఒకింత మంచి జరిగినా, ఆగకుండా కురిసిన కారణంగా రైతులకు అనేక విధాలుగా పెట్టుబడి భారం పెరిగింది.