రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెండో కిసాన్ రైలు పట్టాలెక్కింది. 2020-21 కేంద్ర బడ్జెట్ లో కిసాన్ రైళ్లను ప్రవేశపెడతామని తెలిపిన కేంద్రం.. ఆగస్టు 7న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి పాట్నాకు తొలి కిసాన్ రైలు ప్రారంభించింది. రెండో కిసాన్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశ రాజధాని దిల్లీకి ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా నుంచి న్యూఢిల్లీ మధ్య ఏర్పాటు చేసిన రెండో కిసాన్ రైలు ఇవాళ ప్రారంభమైంది. దక్షిణ భారత దేశం నుంచి ప్రారంభమైన తొలి కిసాన్ రైలు ఇదే కావడం విశేషం. దిల్లీలో తన కార్యాలయం నుంచి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్.సి.అంగడి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాళ్యా , రైల్వే అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 322 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులతో కూడిన కిసాన్ రైలుకూత పెడుతూ పట్టాలపై ముందుగు సాగింది.
సంతోషంగా ఉంది....
తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాల్లోని వివిద రాష్ట్రాల మార్కెట్లకు పండ్లు, కూరగాయలు, సహా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. అక్కడ డిమాండ్ ను బట్టి ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల మీదుగా కిసాన్ రైలు దిల్లీ వెళ్తుందని.. మార్గ మధ్యలో రాష్ట్రాల రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఉద్యాన వన,వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా దిల్లీ సహా పలు రాష్ట్రాల మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. కిసాన్ రైలుతో అనంతపురం జిల్లా నుంచి దిల్లీకి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయవచ్చన్న ఆయన..దేశంలో రెండో కిసాన్ రైలు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
రైతులు ఉపయోగించుకోవాలి...