అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారుల అనుమతి లేకుండా కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు, గుట్టలు, హంద్రీనీవా, హెచ్ఎల్సీ కాలువ గట్టు వంటి ప్రాంతాల్లో.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా గ్రావెల్‌ను తవ్వి ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండ గుట్టల్లో లోతైన గోతులు తవ్వి పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు.
డిమాండ్ తగ్గ ధరతో..
అక్రమాలపై అధికారుల నుంచి అంతగా స్పందన లేదని.. వారు తీసుకుంటున్న అరకొర చర్యలను అక్రమార్కులు లెక్క చేయడం లేదని సమాచారం. ఒక ట్రాక్టర్ మట్టి రవాణాకు దూరాన్ని బట్టి 8 వందల నుంచి 13 వందల దాకా వసూలు చేస్తున్నారు. గ్రావెల్ డిమాండ్ ఉన్న చోట.. ఈ ధరలు మరింత పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా వెలిగొండ గ్రామ పరిసరాలలోని కొండ ప్రాంతంలో కాలువ నింభగల్లు సమీపంలోని హెచ్ఎల్సీ కెనాల్ ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు 20 నుంచి 30 వరకు ట్రాక్టర్ ట్రిప్పులు తరలుతుంటాయి.