అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని నేమకల్లు కంకర క్వారీల్లో అక్రమాలు హద్దులు దాటుతున్నాయి. అధికార పార్టీ నేతకు చెందిన కుటుంబ సభ్యుల పేరిట లీజు పొంది పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం. ప్రభుత్వానికి రాయల్టీ సైతం చెల్లించకుండా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వెయింగ్ మిషన్లు సైతం అధికారులు తనిఖీకి వచ్చే సమయాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. రోజుకు లక్షల్లో ఆర్జిస్తూ ప్రభుత్వానికి మాత్రం నామమాత్రపు రుసుం రాయల్టీగా చెల్లిస్తున్నారు.
నేమకల్లు పరిధిలో గతంలో 21 కంకర క్వారీలు, క్రషింగ్ మిషన్లు ఉండేవి. స్థానిక ప్రజాప్రతినిధికి సైతం 20 హెక్టార్లలో క్వారీ లీజు, క్రషర్ మెషిన్ ఉంది. క్వారీల్లో పేలుళ్లు, దుమ్ము కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని 2018లో రైతులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. విచారణ జరిపి క్వారీల అనుమతులు రద్దు చేసింది. రెండేళ్లకు పైగా ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోగా.. 2021లో సదరు నేత తన పలుకుబడి ఉపయోగించి.. మళ్లీ అనుమతులు తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులు, ఉద్యోగుల పేరిట 4 క్వారీలకు అనుమతులు తీసుకుని ఖనిజాన్ని తవ్వితీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సరిహద్దులు దాటి తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.