ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆపార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో స్థిరాస్తి వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా ఏర్పాటు చేస్తూ.. మూడు పూలు.. ఆరు కాయలుగా తమ వ్యాపారం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెలసిన వెంచర్లలో ప్లాట్ల క్రయ విక్రయాలు చేయకుండా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీంతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపి వేశారు. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలు కఠినంగా ఉండటంతో వెంచర్ల యజమానులు ముందుకు రావడం లేదు. మరో వైపు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం భూములను క్రమబద్ధీకరించుకోకపోతే స్వాధీనం చేసుకోవాల్సి వస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో స్థిరాసి వ్యాపారులు చిక్కుల్లో పడ్డారు.
అనంతపురం జిల్లా ధర్మవరం పురపాలక పరిధిలో 80 వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించారు. సంబంధిత వ్యక్తులకు అధికారులు తాఖీదులు జారీ చేశారు. వీరిలో 43 మంది ఎల్‌ఆర్‌సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు రెండు దరఖాస్తులు అప్రూవ్ చేశారు.
కదిరి మున్సిపాలిటీలో 35 వెంచర్లు అక్రమంగా వెలసినట్లు పట్టణ ప్రణాళికాధికారులు గుర్తించారు. వీటిలో 15 మంది ఎల్‌ఆర్‌సీకి దరఖాస్తులు చేసుకున్నారు. 9 వెంచర్లకు అప్రూవల్స్ కూడా మంజూరు చేశారు.