బాలింతను ఇంట్లో బంధించి.. తన మానవత్వాన్ని కోల్పోయాడో భర్త. ఇద్దరు ఆడపిల్లలేనా? అంటూ.. విచక్షణ కోల్పోయి.. అపస్మారకస్థితిలోకి వెళ్లేలా కొట్టాడు. విడాకులపై సంతకం చేయాలంటూ.. బెదిరించాడు. తనను చంపాలని చూస్తున్నారని ఆ బాలింత కన్నీరుమున్నీరవుతోంది.
అనంతపురంలోని నాయక్ నగర్లో నివాసం ఉండే లక్ష్మీదేవిని తన భర్త జగన్ నాయక్ ఐదు రోజులుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇంటిలో నిర్బంధించి.. బాలింత అని కూడా చూడకుండా కొట్టడంతో లక్ష్మీదేవి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆడపిల్ల పుట్టిందని ఇంటి నుంచి వెళ్లిపోవాలని.. విడాకుల పత్రం పై సంతకం చేయాలని బెదిరిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు లక్ష్మీదేవి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. భర్త, అత్తమామలను పోలీస్ స్టేషన్కు తరలించారు. లక్ష్మీదేవిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
లక్ష్మీదేవికి జగన్ నాయక్తో పెళ్లి అయినప్పటి నుంచి వేధింపులే. మెుదట ఆడపిల్ల పుట్టిందని చిత్రహింసలకు గురి చేశాడు. బిడ్డను తీసుకుని.. పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం గురించి లక్ష్మీదేవి అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు మళ్లీ రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని తన భర్త, అత్తామామలు వేధింపులు మెుదలుపెట్టారు. తనను చంపాలని చూస్తున్నారని లక్ష్మీదేవి చెబుతోంది. తన మామ శంకర్ నాయక్ ఏఎస్ఐగా పని చేస్తున్నారని తెలిపింది. బాధితురాలు తనకు ఫోన్ లో ఫిర్యాదు చేసిందని బాధితురాలిని.. రక్షించి.. ఆస్పత్రికి తరలించామని సీఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:
'జగనన్న తోడు' ప్రారంభం.. చిరు వ్యాపారుల ఖాతాల్లోకి రూ. 905 కోట్లు