అధికారుల తీరు కారణంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో శ్మశానవాటికకు కేటాయించిన స్థలంలో పట్టాలు అందజేతకు సిద్ధమయ్యారు. భూమి కొని పేదలకు స్థలాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. అధికారులు తమకు శ్మశానవాటికను అంటగడుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులెవరూ రాకపోగా.. సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఓబులదేవరచెరువులోనూ పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. 217 మంది లబ్ధిదారులకు స్థలాలు అందజేసేందుకు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సిద్ధమయ్యారు. వీఆర్వో ఆదినారాయణమ్మ డబ్బులు తీసుకొని అనర్హులకు పట్టాలను అందజేశారంటూ మహిళలు గొడవకు దిగారు. తమకు ఇళ్ల స్థలాలు ఎందుకు రాలేదో తహసీల్దార్ సమాధానం చెప్పాలంటూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కల్పించుకొని వారికి సర్దిచెప్పగా గొడవ సద్దుమణిగింది.