ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ బంగారు నగలు, ఖరీదైన వస్తువులు ఉంచిన సంచిని బస్సులో మరచిపోయింది. బస్సులో ఉన్న సంచిని గమనించిన కండక్టర్ నిజాయితీతో రూ.2 లక్షల విలువచేసే బంగారు నగలను ఆమెకు తిరిగి అప్పగించారు. కండక్టర్ నిజాయితీని అందరూ అభినందించారు.
బస్సులో మహిళ మర్చిపోయిన బంగారాన్ని తిరిగిచ్చిన కండక్టర్..
అనంతపురం జిల్లా ధర్మవరం డిపో ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికురాలు మరచిపోయిన బంగారు ఆభరణాల సంచిని గుర్తించిన కండక్టర్ డిపో మేనేజర్ సాయంతో వారికి తిరిగి అందించాడు. ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు..ప్రయాణికులకు నమ్మకమైన సంస్థ అని డిపో మేనేజర్ అన్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గోరంట్ల నుంచి ధర్మవరం వస్తుండగా.. లక్ష్మీ ప్రసన్న అనే మహిళ, ఆమె కుమారుడు రంజిత్ కుమార్ గోరంట్లలో బస్సు ఎక్కి పెడబల్లి గ్రామంలో దిగారు. ధర్మవరం ఆర్టీసీ డిపోకు బస్సు చేరుకోగానే బస్సులో ఉన్న సంచిని కండక్టర్ నారాయణరెడ్డి గమనించాడు. డిపో మేనేజర్ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్ళాడు. ప్రయాణికుల బ్యాగ్లో లభించిన చిరునామా ఆధారంగా వారికి సమాచారం అందించారు. ప్రయాణికురాలను పిలిపించి డిపో మేనేజర్ వారికి బంగారు నగల సంచిని తిరిగి అందజేశారు. ఆర్టీసీ అంటే సురక్షితమే కాదు.. నమ్మకం కూడా అని డిపో మేనేజర్ అన్నారు.
ఇదీ చదవండి:రహదారి విస్తరణ పనులు జరిగేనా.?