Home For Birds Society : కొంతకాలం క్రితం గ్రామాల్లో, పట్టణాల్లో పక్షుల కిలకిలారావాలు సందడి చేసేవి. కాలం గడుస్తున్న కొద్దీ వాటి అరుపులు కాదు కదా..పక్షులను చూడటమే గగనంగా మారింది. అందుకు ముఖ్య కారణం..పక్షులకు సరైన గూళ్లు నిర్మించుకోవడానికి ఆవాసాలు లేకపోవడమే. ఈ సంగతి గుర్తించిన అనంతపురం యూత్ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. అంతేకాదు చెట్లపై పక్షుల కోసం ప్రత్యేకంగా గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం అంతటా 2వేలకుపైగా గూళ్లు అందిస్తూ.. పక్షుల సంరక్షణకై కృషి చేస్తున్నారు, ఈ హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యులు.
పక్షుల గూళ్లు పట్టుకున్న వీరంతా అనంతపురానికి చెందిన పక్షి ప్రేమికులు. కొన్నాళ్లుగా మెుక్కల పెంపకం, పక్షుల రక్షణ వంటి చర్యలు చేపడుతున్నారు. ఐతే.. ఓ బృందంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టడానికి వీరివద్ద ఆర్థిక స్థోమత లేదు. ఇలాంటి తపన గల యువ శక్తుల కోసం పర్యావరణ ప్రేమికులు అనిల్‌కుమార్ ఎదురుచూస్తున్నారు. వీరి గురించి తెలియగానే ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వచ్చారు. అలా వీరంతా ఓ బృందంగా ఏర్పడి హోం ఫర్ బడ్స్ సోసైటీ ఏర్పాటు చేశారు.
"ఎండాకాలం వస్తుండటంతో పక్షులు గూళ్లు కట్టుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే మేమే సహజ పద్ధతిలో వాటికి గూళ్లను తయారు చేసి చెట్లకు అమరుస్తున్నాము. మా బృందంలో ఉన్న ఈ యువ సభ్యులంతా ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. కానీ వీరంతా విద్యార్థులు కావడంతో వీరికి సొంత ఆదాయం లేదు. అందుకే నేను నావంతు ఆర్థికంగా సాయం అందిస్తున్నాను. మా సొసైటీ ద్వారా సాధ్యమైనన్ని పక్షులకు గూళ్లను అందించేందుకు కృషి చేస్తున్నాం. " -అనిల్ కుమార్, హోం ఫర్ బడ్స్ సొసైటీ వ్యవస్థాపకులు
ఇదీ చదవండి :Online Betting: ఆన్‌లైన్‌లోకి కోళ్లు, పందేలు.. లైవ్‌లో చూస్తూ బెట్టింగులు
ఈ బృందం... అనంతపురం నగరంలో ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయని తొలుత సర్వే నిర్వహించింది. ఆ సమాచారం ఆధారంగా వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఆర్నథాలజీ నిపుణులతో మాట్లాడారు. ఏ పక్షి ఎలాంటి గూడు కట్టుకట్టుకుంటుంది, అన్ని పక్షులకు సరిపోయేలా గూళ్లు తయారు చేయడం ఎలా..? వంటివి అడిగి తెలుసుకున్నారు. అధ్యయనం తరువాత... 4 రకాల పక్షి గూళ్లు తయారు చేయిస్తున్నారు...
" పక్షులకు నీటిని, ఆహారాన్ని అందిస్తున్నాం. అలాగే నీడ కూడా ఇవ్వాలనుకున్నాం. కానీ వాటికి గూళ్లు లేక పోవడంతో పావురాలు, డేగలు ఈ చిన్న పక్షులపై దాడి చేస్తున్నాయి. అందుకే అవి నిర్మించుకునే గూళ్ల వంటివే తయారు చేద్దామనుకున్నాం. గూగుల్ లో వెతికి ఈ రకంగా పక్షుల గూళ్లను తయారు చేసే వారి గురించి తెలుసుకున్నాం. ఏ పక్షి ఏరకమైన గూడు నిర్మించుకుంటుందన్న విషయంపై శోధన చేసి పక్షి గూళ్లను కోయంబత్తూరు నుంచి తెప్పించుకుంటున్నాం"-మధురిమ, అనిల్ కుమార్ భార్య
వీరంతా వివిధ కళాశాలల్లో చదువుకుంటూ సెలవు రోజుల్లో, ఖాళీ సమయాల్లో చెట్ల సంరక్షణ కోసం కృషిచేస్తున్నారు. తెల్లవారక ముందు, సాయంత్రం పక్షులు తిరిగి నగరానికి వచ్చే సమయానికి వీధుల్లో సర్వే చేయటానికి వెళతారు. రోజూ ఒక కాలనీని ఎంపిక చేసుకొని పక్షలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని స్థానికంగా విచారణ చేస్తారు. చెట్లు తక్కువ ఉన్న కాలనీల్లో మొక్కలు నాటటంతోపాటు, ఇంటి యజమానుల్ని ఒప్పించి గృహాల ఆవరణలో పక్షి గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి :VV Vinayak : 'మర్యాదలైనా.. రుచులైనా.. గోదారోళ్ల ప్రత్యేకతే వేరు'
" మా ప్రాజెక్టులో భాగంగా మొక్కలను నాటుతున్నాం. కేవలం నాటడమే కాదు. వాటిని పరిరక్షించడం మా ప్రాధాన్యం. అలాగే చెట్లపై పక్షులకు గూళ్లను ఏర్పాటు చేసి అంతరించిపోతున్న పక్షుల జాతుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. " -ఆయేషా, హోం ఫర్ బడ్స్ సొసైటీ సభ్యురాలు