అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని హరిపురం సమీపంలో గల హంద్రీనీవా కాలువ తెగిపోయి.. కృష్ణా జలాలు పంట పొలాలపై పారుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఎల్-4 పంప్ హౌస్లో విద్యుత్ అంతరాయం ఏర్పడి పంపులు నిలిచిపోవడంతో కాలువలో నీటి ప్రవాహం ఒక్క సారిగా ఆగిపోయింది. గొల్లపల్లి జలాశయం నుంచి వస్తున్న నీటితో కాలువ నిండిపోయి హరిపురం వద్ద తెగిపోయింది. కాలువ తెగిపోవడంతో కృష్ణా జలాలు పొలాలపై అడ్డంగా పారుతుండటంతో పొలాలు కోతకు గురవుతున్నాయి.
ఈశ్వరయ్య అనే రైతు పది రోజుల క్రితం వేరుశనగ విత్తనం వేశాడు. కాలువ కోతకు గురై వచ్చిన వృధా నీరు పొలంలోకి రావటంతో ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలోని వేరుశనగ కొట్టుకుని పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వారంలో ఇలా కోతకు గురవడం రెండోసారి అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.