ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HEAVY RAINS: భారీ వర్షాలతో అనంత అతలాకుతలం..నీట మునిగిన పంటలు

By

Published : Nov 19, 2021, 10:01 AM IST

Updated : Nov 20, 2021, 5:46 AM IST

వాయుగుండం ప్రభావంతో అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు(Heavy rains in ananthapuram district) కురుస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పొలాల్లోకి వర్షపు నీరు చేరింది.

rains in ananthapuram district
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కదిరి జలదిగ్బంధంలో చిక్కుకుంది. అన్ని వైపులా వర్షపు నీరు చుట్టముట్టడంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మద్దిలేరు నది ప్రవాహ ఉద్ధృతికి బెంగళూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కుటాగుల రైల్వే గేట్ సమీపంలో రోడ్డు మీద 5 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు శింగనమలలో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఆరుగాలం శ్రమించిన పంట కోతకొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జి వద్ద నిర్మించిన డైవర్షన్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా నార్పల, గూగుడు మధ్య రాకపోకలు స్తంభించాయి. గోరంట్ల వద్ద చిత్రావతి నది ఉప్పొంగుతోంది. భారీ వాహనాలు వంతెన పై వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలకు హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. చిలమత్తూరు మండలంలో చిత్రావతి, కుషావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఇల్లు కూలి ఒకరు మృతి...

డి.కె.పల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో చిక్కుకున్న నలుగురిని పొక్లెయిన్‌ సాయంతో స్థానికులు కాపాడారు. వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన పొక్లెయిన్‌పై ఉన్న 10 మందిని కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ప్రయత్నించారు.వాయుసేన అధికారులతో మాట్లాడిన కలెక్టర్ హెలికాప్డర్ తెప్పించి పది మందిని కాపాడారు. పరిగి మండలంలో ముగ్గురు భారీ వరదలో చిక్కుకున్నారు.రామగిరి మండలం గంతిమర్రిలో వర్షానికి ఇల్లు కూలి రంజిత్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

'కట్టుబట్టలతో మిగిలాం'

రిజర్వాయర్​కు గండి..

బేలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర అలజడి నెలకొంది. రిజర్వాయర్ వద్ద చిన్న గండి పడినట్లు కొందరు వ్యకులు గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా గ్రామం మొత్తం అప్రమత్తమయ్యారు. గండి పండింది నిజమే కాదో తెలియక.. ఎప్పుడేం జరుగుతుందో అని జీడిపల్లి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థులు మొత్తం ఎక్కడ గండి పడిందో అని లైట్లు వేసుకొని వెతికారు. దిగువ ప్రాంతంలో హంద్రీనీవా కాలువకు గండి పడడంతో రిజర్వాయర్ గేట్లు మూసేసారు. దీంతో ఒక్కసారిగా రిజర్వాయర్ కు నీటిమట్టం అధికమైంది. రిజర్వాయర్ తూములు తెరిచి నీరు వదిలితే సమస్య పరిష్కరం అవుతుందని గ్రామస్థులు తెలిపారు. అయితే తీవ్ర వర్షం కారణంగా ఎక్కడ గండి పడిందో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే సాధారణంగా గ్రామంలో ఎప్పుడు ఊట నీళ్లు వస్తూనే ఉంటాయి. గండి పడిందని చొప్పిన ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా వస్తుండడంతో చెట్లు, రాళ్లు ఉండడంతో చీకటిలో అక్కడికి వెళ్లేందుకు ఎవరు కూడా సహసించలేదు.

అయితే గ్రామ సర్పంచ్ వెంకట నాయుడు 'ఈటీవీ ప్రతినిధికి' చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కు విషయాన్ని తెలిపారు. కలెక్టర్ గ్రామ సర్పంచ్ వెంకట నాయుడుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. హుటాహుటిన కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేసి గ్రామానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొని..అవసరమైతే సహక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ఉన్న ప్రజలంతా వారి పిల్లలను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

ప్రాజెక్టును చూసేందుకు వెళ్లి..

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని నింకంపల్లి సమీపంలో కుముద్వతి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టును చూసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు... వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి... ఇద్దరు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

డ్యాం నుంచి గ్రామంలోకి నీళ్లు.. ఆందోళనలో ప్రజలు

పార్నపల్లి డ్యామ్‌ గేట్లు ఎత్తి... చిత్రావతి నదికి వరద నీరు విడుదల చేశారు. దీంతో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం లక్షుంపల్లి గ్రామంలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉరవకొండ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శివరామిరెడ్డి కాలనీ నీటమునగటంతో.... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పిల్లలు, మహిళలకు స్థానిక డిగ్రీ కళాశాలలో వసతి ఏర్పాటు చేసి ఆహారం అందించారు. ఇళ్లు వరద నీటిలో మునిగిపోయి... కట్టుబట్టలతో మిగిలిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతి నది వరద ఉద్ధృతితో ధార్మిక క్షేత్రం పుట్టపర్తి మునిగిపోయింది. సాయినగర్‌ కాలనీలోని ఇళ్లు జల దిగ్భందలో చిక్కుకున్నాయి. టైర్లు, తాళ్లు సహాయంతో పోలీసులు స్థానికులను కాపాడారు. కొందరు చిన్నారులు, వృద్ధుల్ని భుజాలపై ఎత్తుకుని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

ఇదీచదవండి.

Last Updated : Nov 20, 2021, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details