ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్న వర్షాలు.. పొంగుతున్న వాగులు..

By

Published : Jul 23, 2020, 12:53 PM IST

అనంతపురం జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. 2 మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ సగటు కన్నా భారీ వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటపొలాల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.

heavy rains in ananthapuram district
rains in ananthapuram

అనంతపురం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురుస్తోంది. జిల్లాలో 63 మండలాలు ఉండగా.. 2 మినహా అన్నింటిలో అధిక వర్షపాతం నమోదైంది. ముదిగుబ్బ, రొద్దం మండలాల్లో మాత్రమే సాధారణ వర్షం నమోదైంది. గత రాత్రి సుమారు 10 మండలాల్లో భారీ వర్షం కురిసింది.

అత్యధికంగా పామిడిలో 133 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తరువాత పెద్దవడుగూరులో 85, శెట్టూరు, కూడేరులో 52, విడపనకల్లులో 50, గుంతకల్లు, కళ్యాణదుర్గంలో 49 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలో ఇప్పటి వరకు 116 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 234 మిల్లీమీటర్లు వర్షం పడింది. అంటే 101 మిమీ వర్షం అధికంగా కురిసినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వానకు పొలాల్లోకి నీరు చేరింది. వీర్నపల్లి నుంచి పామిడికి వెళ్లే రహదారి పూర్తిగా కోతకు గురై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండూరు సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంకను దాటుతున్న క్రమంలో రాజు అనే వ్యక్తి కొట్టుకుపోతుండగా.. గ్రామస్థులు గమనించి రక్షించారు. గుంతకల్లు, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుంతకల్లు మండలం నాగసముద్రం, పామిడి మండలం కండ్లపల్లి వద్ద వాగులు భారీగా ప్రవహిస్తున్నాయి. పామిడిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పామిడి గుంతకల్లు మధ్య నాగసముద్రం మీదుగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కురిసిన వర్షం వేరుసెనగ పంటకు కలిసొస్తుందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ఇవీ చదవండి...

పశ్చిమగోదావరిలో రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details