అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో.. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఆత్మకూరు మండలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం శివారులోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఈ వాగు దాటుతుండగా అకస్మాత్తుగా ఆగిపోయింది.
ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వాగునీటి మధ్యలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు భయపడి కేకలు వేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంబదూరు, కుందుర్పి, సెట్టూరు మండలాల్లో కూడా భారీ వర్షం కురవడంతో చెక్ డ్యాములు నిండిపోయాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.