అనంతపురం జిల్లా యాడికి మండలంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామ సమీపంలో ప్రధాన రహదారులు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిన్నెపల్లి గ్రామ సమీపంలో వాగు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తమ్మేపల్లి, లలేప్ప కాలనీ, రెడ్ల గుడిసెలు మునిగిపోవటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చేనేత, వండ్రంగి పనులు చేసుకునే వారి ఇళ్లల్లోకి వరద నీరు చేరటంతో తీవ్రంగా నష్టపోయామంటూ వారు వాపోతున్నారు. ఉదయం నుంచి అల్పాహారం తీసుకోవటానికైనా ఆస్కారం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగ నష్టపోయన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎస్పీ సత్య ఏసుబాబుపరామర్శించారు.