వర్షం కోసం ఎప్పడూ ఆకాశానికేసి ఆశగా చూసే అనంతపురం జిల్లా రైతులను... ఈసారి వర్షాలే దెబ్బతీశాయి. ఈనెలలో కదిరి, బెలుగప్ప, బుక్కరాయ సముద్రం, ధర్మవరం మండలాల్లో రికార్డుస్థాయిలో వర్షాలు కురిశాయి. 300 హెక్టార్ల మేర.. వేరుశనగ, వరి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం తదితర పంటలకు నష్టం వాటిల్లింది. 25 నుంచి 40 రోజుల క్రితం.. మొలకెత్తిన పంటలు మొక్కదశలోనే నాశనం చేశాయి. కొన్నిప్రాంతాల్లో పంటలు ప్రవాహంలో కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల నీరు రెండు రోజుల పాటు నిల్వ ఉండి కుళ్లిపోయాయి.
ఇరవై ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి వర్షాలు చూడలేదని..పైర్లు పశువుల మేతకూ పనికిరాకుండా పోయాయని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో గతేడాది నష్టాలను ఈసారి పూడ్చుకుందానే ఆశతో సాగు చేస్తే.. సీజన్ ఆరంభంలోనే కష్టం తుడిచిపెట్టుకుపోయిందని వాపోతున్నారు. మొక్క దశలో నాశనమైన పంట నష్టం అంచనా వేసేందుకు.. జిల్లా అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. ప్రభుత్వం అనుమతిస్తేనే.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ లభిస్తుంది.