అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా వేరుసెనగ పంట సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండాపోయింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేరుసెనగ కుళ్లిపోయి కనీసం పశు గ్రాసానికి కూడా పనికి రాకుండా పోయింది. గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు జిల్లాలోని పంటలకు అపార నష్టం తెచ్చి పెట్టాయి. కొన్ని చోట్ల కాయ రంగు మారడంతో వచ్చిన అరకొర పంట కూడా నోటికందకుండా పోయింది. అన్నదాతలకు భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లి అల్లాడుతున్నా.. అధికారులెవరూ పొలాల వైపు తిరిగి చూడట్లేదని రైతులు వాపోతున్నారు.
అవే తమ కొంప ముంచుతాయిని..
ఈసారి మాత్రం ప్రకృతి నమ్మించి మోసం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. ప్రకృతి బాగా సహకరిస్తోందన్న ఆశతో రైతు రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారు. అవే వర్షాలు తమ కొంప ముంచుతాయని ఊహించలేకపోయారు. ప్రధానంగా వేరుసెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుసెనగ సాగు ప్రారంభం నుంచే అధిక వర్షాలు కురిశాయి. ఫలితంగా పంట తెగుళ్ల బారిన పడింది. ఆ తరువాత కోత దశకు చేరుకుంది.
మరింత నష్టం..
ఈ నేపథ్యంలో గత రాత్రి సహా కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు మరింత నష్టం చేకూర్చాయి. జిల్లాలోని మొత్తం 63 మండలాల్లో వర్షం కురవగా.. అందులో 30 మండలాల్లో అధిక వర్షం నమోదైంది.
ఈసారి వేరుశనగ..
ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం 6 లక్షల 41 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వేరుసెనగ 5 లక్షల హెక్టార్లలో సాగైంది.