Heavy rain: కరవుకు చిరునామాగా చెప్పుకునే అనంతపురం జలమయమైంది. అనేక కాలనీల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవేశించటంతో జనావాసాలన్నీ జలదిగ్భంధమయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి.. ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఆలమూరు చెరువు నుంచి నడిమివంకకు ఎన్నడూ లేనంతగా భారీ ప్రవాహం వచ్చింది. దాంతోపాటు నడిమివంక ఆక్రమణలకు గురికావటంతో ప్రవాహం వెళ్లడానికి దారిలేక కాలనీలను చుట్టుముట్టింది. నగరంలోని సోమనాథనగర్, రంగస్వామినగర్‌లతోపాటు.. అనంతపురం గ్రామీణ మండలంలోని గౌరవ గార్డెన్స్, రుద్రంపేట పంచాయతీ, యువజన కాలనీ పూర్తిస్థాయిలో జలదిగ్భంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద ప్రవేశించటంతో.. అర్ధరాత్రి నుంచి ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. అనేక కాలనీల్లో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తూనే ఉంది.
అనంతపురం గ్రామీణ మండలంలోని మరువవంక పొడవునా.. కాలనీలను వరదనీరు ముంచెత్తింది. లోతట్టులోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించటంతో.. నిత్యావసర వస్తువులతో పాటు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. మధ్యాహ్నం వరకు అధికారులు ఎక్కడా ఉపశమన చర్యలు చేపట్టలేకపోయారు. ముంపు ప్రాంత ప్రజలు ఆహారం, తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కర్నూలు, శింగనమల నుంచి బోట్లు తెప్పించి, వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కొంతమేర భోజనం ప్యాకెట్లు, నీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో రాత్రంతా చీకట్లోనే గడిపామని బాధితులు వాపోతున్నారు.