అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కదిరిలో అత్యధికంగా ఒక్కరోజే 263 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని కుమ్మర వాండ్ల పల్లిలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లోకి నీరు చేరింది. 12 టన్నుల ధాన్యం మునిగిపోయింది. ధాన్యంతో పాటు యంత్రాలు నీట మునిగిపోయాయి. లక్షల్లో నష్టపోయామని ప్రాసెసింగ్ యూనిట్ యజమాని దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే సహాయం చేసి తమను ఆదుకోవాలని కోరారు.
కదిరి పట్టణానికి సమీపంలో పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. 1200 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇటీవల ఇళ్ల నిర్మాణాన్ని అట్టహాసంగా ప్రారంభించగా... లక్షల రూపాయలు ఖర్చు చేసి అందరు పునాదులు వేసుకున్నారు. భారీ వర్షం ధాటికి కొన్ని పునాదులు కొట్టుకుపోగా మరికొన్ని కుంగిపోయాయి. నివాసానికి పనికిరాని ప్రదేశంలో స్థలాలను కేటాయించి నిర్మాణానికి తమపై ఒత్తిడి తెచ్చిన అధికారులే తమను ఆదుకోవాలని లబ్ధిదారులు వాపోతున్నారు.
భారీ వర్షాల కారణంగా జలమయమైన జగనన్న కాలనీని తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. నివాసానికి పనికిరాని ప్రదేశంలో ఇళ్ల స్థలాలను కేటాయించి, పేదలపై భారాన్ని మోపి వారిని అప్పుల్లోకి నెట్టడం సరికాదని విమర్శించారు. పేదలందరికీ మరో చోట ఇంటి పట్టాలను కేటాయించే ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.