అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం వైకాపా, తెదేపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. జేసీ, కేతిరెడ్డి నివాసాల వద్ద పోలీసులు చెక్ పోస్టుల ఏర్పాటు చేసి జనసంచారం లేకుండా చేశారు. అలాగే పట్టణంలోకి బయటి ప్రాంతాల నుంచి ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాకుండా ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గస్తీ చేపట్టారు. ఏడుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, దాదాపు 50 మంది ప్రత్యేక విభాగం పోలీసులతో గట్టి బందోబస్తును అమలు చేస్తున్నారు.
జేసీ సహా 17 మందిపై కేసు
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరో 15 మందిపై కేసులు నమోదయ్యాయి. కులంపేరుతో దూషించారని వైకాపా కార్యకర్త మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ తేజమూర్తి తెలిపారు.