ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఖజానా ఎవరిది..! - అనంతపురం నేర వార్తలు

అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రంలోని ఊహకందని విధంగా....ఓ ఇంట్లో భారీఎత్తున అవినీతి ‘ఖజానా’ బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న షెడ్డులో 8 ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి చెందినదిగా భావిస్తున్నారు. ఇందులోనే ఓ తుపాకీ‌ కూడా లభ్యమైంది.

Heavy gold and silver jewelry was found in a house in Bukkarayasamudram
బుక్కరాయసముద్రంలో విచారిస్తున్న డీఎస్పీ తదితరులు

By

Published : Aug 19, 2020, 8:09 AM IST

బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో భారీగా బంగారు, వెండి నగలు వెలుగుచూశాయి. ఎనిమిది పెట్టెల్లో నిల్వ ఉంచిన ఆభరణాలను పోలీసులు గుర్తించారు. వీటితోపాటు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఒక్కసారి బయటపడటంతో జిల్లాలో కలకలం రేగింది. ఆ సొమ్ము ఎవరిది? ఎక్కడ్నుంచి తెచ్చారు అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇనుప పెట్టెల్లో భద్రపరచి చిన్న షెడ్డులో ఎందుకు ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖజానా ఎవరిది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మంగళవారం అర్ధరాత్రి సమయానికి నాలుగు పెట్టెలు తెరచి అందులోని ఆభరణాల విలువ లెక్కించగా 1.75 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెండి సామగ్రి చెంచాలు, గిన్నెలు, గ్లాసులు, చెంబులు ఉన్నాయి. బంగారం గాజులు, దండలు, హారాలు, వడ్డాణాలు రూపంలో ఉన్నాయి. నగదు రూ.15 లక్షలు దాకా కొన్ని పెట్టెల్లో బయట పడింది. ఇందులో రూ.30 లక్షల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు గుర్తించారు. ఈ సొమ్మంతా ఖజానా శాఖలో పనిచేసే ఒక ఉద్యోగికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు ఆ ఉద్యోగి బంధువుల పేర్ల మీద ఉన్నట్లు సమాచారం.

  • ఖజానా శాఖలో ఆయన మాటే వేదం

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఆ ఉద్యోగి సుమారు 15 ఏళ్ల కిందట ఖజానా శాఖలో ఉద్యోగిగా చేరాడు. ఆ శాఖలో ఎవరికి ఏ సెక్షన్లో పని ఉన్నా ఆ ఉద్యోగినే సంప్రదిస్తారు. ఆయన సొమ్ము ఇవ్వనిదే ఏ పనీ చేయడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయన మాట నెగ్గాల్సిందే. లేదంటే బెదిరింపులకు వెనుకాడడు. రూ.లక్షలు ఇచ్చినా.. ఇంకా పని చేయకుండా కాలయాపన చేస్తున్నారని కొందరు బాధితులు వాపోయారు. పలు మార్గాల్లో అక్రమంగా సంపాదించాడు. విలాసవంతంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు నాలుగు కార్లు, నాలుగు బుల్లెట్‌ వాహనాలు, రెండు గుర్రాలు ఉన్నాయంటే.. ఆయన సంపాదన ఏమిటో అర్థమవుతోంది. ఇటీవల రూ.15 లక్షలు ఖరీదైన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఇంకా అనేక ఆస్తులు బినామీల పేర్లతో ఉన్నాయి. అశోక్‌నగర్‌లో సెంట్రల్‌ ఏసీతో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. బుక్కరాయసముద్రానికి వెళ్లే దారిలో చెరువుకట్ట వద్ద మరో నివాసం ఉన్నట్లు సమాచారం. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కార్యాలయానికి విధులకు వస్తుంటాడు. ఆయన వెంట నిత్యం నలుగురు యువకులు అంగరక్షకుల్లా ఉంటారు. వారికి మంచి వేతనంతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం సమకూరుస్తున్నాడు. మొత్తంగా 10 మంది యువకులకు వేతనాలు చెల్లిస్తూ.. వివిధ పనులు అప్పగిస్తున్నట్లు తెలిసింది.

  • రియల్‌ దందా చేశాడా?

ఖజానా ఉద్యోగి తన వద్ద ఎయిర్‌ పిస్టల్‌ను ఉంచుకోవడంతో రియల్‌ దందాలు చేశాడా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పిస్టల్‌ పట్టుకుని తగాదా ఉన్న భూములు కొనుగోలు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆయన పేరుతో నగరంలో చాలాచోట్ల ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అక్రమార్జనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తే అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. మరోవైపు రాజకీయ అండ కూడా ఉన్నట్లు సమాచారం. అధికారులపై ఒత్తిళ్లు చేయించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తుపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇదీ చదవండి: ఇంట్లోని ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి నిల్వలు..

ABOUT THE AUTHOR

...view details