HEAVY FLOODS IN ANANTAPUR : అనంతపురం నగరంలో నడిమివంక ఉద్ధృతి కారణంగా.. మంగళవారం అర్ధరాత్రి నుంచి జలదిగ్బంధంలో ఉన్న దాదాపు 20 కాలనీలు.. ఇప్పటికీ వరద గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. చుట్టుపక్కల చెరువుల నుంచి పెద్ద ఎత్తున వరద నడిమివంకలోకి చేరుతుండటంతో.. నగరంలోని లక్ష్మీనగర్, ఆజాద్‌నగర్, సీపీఐ కాలనీ, నాలుగు, ఐదు, ఆరు రోడ్లు, రంగస్వామినగర్, సోమనాథ్ నగర్, శాంతినగర్, భగత్‌సింగ్ నగర్, రజకనగర్, గౌరవ గార్డెన్స్ కాలనీలతో పాటు.. రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబుకొట్టాల, చైతన్య కాలనీ, విశ్వశాంతినగర్, కక్కలపల్లి కాలనీ, జాకీర్ కొట్టాల ముంపులోనే ఉన్నాయి.
అనంతపురం గ్రామీణ మండలంలోని కాటిగాని కాలువ చెరువుకు.. ఎగువ నుంచి భారీ వరద రావడంతో.. చెరువు కట్టపై నుంచి నీరు పొంగి పొర్లి కాటిగానికాలువ గ్రామంలోకి ప్రవేశించాయి. గ్రామస్థులు మట్టితోడే యంత్రాలు తీసుకెళ్లి చెరువు మరవ కట్టను తొలగించారు. ఆ చెరువు నుంచి భారీ వరద కక్కలపల్లి చెరువుకు, అక్కడి నుంచి నడిమనివంక ద్వారా అనంతపురం నగరంలోకి వస్తుండటంతో నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోయింది.
రామస్వామినగర్‌లో ప్రమాద స్థాయిలో నడిమివంక ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాలనీల్లో దాదాపు ఆరు అడుగులు దాటి వరద ముంచెత్తింది. రంగస్వామినగర్ నాలుగో రోడ్డు, ఐదో రోడ్ల కాలనీల్లో ఇళ్లన్నీ నీటిలోనే నానుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని కిరాణ, వస్త్ర దుకాణాల్లోకి వరద నీరు చేరాయి. దాదాపు రెండు రోజులుగా నీటిలోనే ఇళ్లన్నీ నానుతుండటంతో.. కొన్ని ప్రమాదకర స్థాయికి చేరాయని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద వల్ల పది ఇళ్లకుపైగా కూలిపోయాయని చెబుతున్నారు.