దానిమ్మ పంట రైతుల మోముల్లో దరహాసం పండించింది. అనంతపురం జిల్లాలో ఎకరం పొలంలో సాగుచేసిన రైతు సైతం లాభాలు చవిచూశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణం ఎదురై దానిమ్మ పూత, పిందె రాలిపోవటంతో అనంత రైతుల పంట పండింది. జిల్లాలో కూడా కుండపోత వానలు ఇబ్బంది పెట్టినా.. దిగుబడి కాస్త తగ్గింది కానీ పంట పూర్తిగా దెబ్బతినలేదు. దేశంలో దిగుబడి లేకపోవటం దానిమ్మ రైతులకు కలిసొచ్చిన అంశం.
ఇందుకు తోడు కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పండ్ల వినియోగం పెరగటంతో అన్ని రాష్ట్రాల్లో ధరలు రికార్డుస్థాయిలో ఉన్నాయి. జిల్లాలో ఎక్కువ మంది రైతులు సెప్టెంబర్‌లో పంట దిగుబడి తీసుకునేలా తోటలు సాగుచేస్తున్నారు. ఆ సీజన్‌లో పంట కోతకు ప్రణాళిక చేస్తే పలు రకాల తెగుళ్ల నుంచి పండ్లను కాపాడుకోవచ్చనేది ఇక్కడి రైతులకు అనుభవ పాఠం. పెట్టుబడికి తగిన ధరలు రావటంతో దానిమ్మ రైతుల కష్టానికి ఫలితం దక్కింది.
అక్కడి నష్టమే.. మనకు లాభం
దానిమ్మ సాగులో మహారాష్ట్ర దేశంలో అగ్రస్థానంలో ఉంది. నిరంతర వర్షాల కారణంగా షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్ తదితర ప్రాంతాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. కర్ణాటక రాష్ట్రం సాగులో రెండో స్థానంలో ఉండగా.. అక్కడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏటా సెప్టెంబర్‌లో పంట తీసుకునేలా ఆ రెండు రాష్ట్రాల రైతులు తోటలు నిర్వహిస్తారు. ఈ సారి ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు ఈ పంటను బాగా దెబ్బతీశాయి. నల్లమచ్చ తెగులు, బ్యాక్టీరియా విజృంభించటంతో పూత, పిందె పూర్తిగా రాలిపోయింది.
ఉత్తరాది సూపర్ మార్కెట్లకు, విదేశాలకు ఎగుమితి చేసే మహారాష్ట్ర రైతులు నష్టపోయారు, వ్యాపారులకు రాబడి పోయింది. అక్కడ దిగుబడి లేకపోవటం, కర్ణాటకలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తటంతో వ్యాపారులంతా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో వాలిపోయారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాతావరణం, అకాల వర్షాల ప్రభావం ఉన్నా.. రైతులు పంటను కంటికి రెప్పలా చూసుకోవటంతో 50 శాతం పంట దిగుబడి దక్కింది.
పోటెత్తిన కర్ణాటక వ్యాపారులు
ఏటా రైతులకు కనిష్ఠ ధరలిస్తూ రూ.కోట్ల వ్యాపారం చేస్తున్న కర్ణాటక బడా వ్యాపారులంతా.. అనంతపురం జిల్లాకు పోటెత్తారు. కర్ణాటక రాష్ట్రంలో కొనుగోలు చేసిన దానిమ్మను బెంగళూరు, మైసూరు తదితర ప్రధాన నగరాల్లోని సూపర్ మార్కెట్లకు తరలించే వ్యాపారులకు ఈ సారి ఆ రాష్ట్రంలో నాణ్యమైన ఉత్పత్తి లభించటంలేదు. దీంతో అనంతపురం జిల్లాకు వచ్చి అధిక ధరలిస్తామని రైతుల చుట్టూ తిరుగుతున్నారు. ముందుగానే గొలుసుకట్టు సూపర్ మార్కెట్లతో ఒప్పందం చేసుకున్న వ్యాపారులు సరకు ఇవ్వలేకపోతే, ఆయా సంస్థలు మరో వ్యాపారిని ఆశ్రయిస్తాయని ధర పెంచుతున్నారు.