ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HANDRI : నత్తనడకన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పనులు - handrineeva sujala sravanthi scheme in ananthapuram district

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అనంతపురం జిల్లా రైతులకు కలగానే మిగిలిపోయింది. కరవుతో జిల్లాకు సంజీవిని లాంటి హంద్రీనీవా పాలకుల నిర్లక్ష్యంతో ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ప్రధాన కాలువ పూర్తై కృష్ణా జలాలు జిల్లాకు చేరుతున్నా ఆయకట్టుకు నీరందించే ఉప కాలువల నిర్మాణ పనులు ఏళ్లుగా నత్తనడకగానే సాగుతున్నాయి.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం

By

Published : Aug 23, 2021, 3:48 AM IST

హంద్రీనీవా ఫేజ్-1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. అప్పటి నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరుతున్నాయి. పక్కనే నీరు ప్రవహిస్తున్నా రైతులకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు నీరందించే ఉప కాలువల పనులు దశాబ్దాల తరబడి కొనసాగుతుండడంతో ఈ దుస్థితి నెలకొంది. 33, 34 ప్యాకేజీల్లో చేపట్టిన డిస్ట్రిబ్యూటరీల పనులు..... గత ప్రభుత్వ హయాంలోనే 95 శాతం పూర్తయ్యాయి. అక్కడక్కడా కాలువల పైవంతెనలు, కల్వర్టులు, అక్విడెట్‌ల నిర్మాణాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసి చెరువులకు నీరందిస్తే ఉరవకొండ, వజ్రకరూర్‌, విడపనకల్లు, బెళుగుప్ప మండలాల పరిధిలోని 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. అప్పటి వరకూ చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో గుత్తేదారులు రెండేళ్లుగా పనులు నిలిపివేశారు. గడచిన రెండేళ్లలో ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాలువలు, వంతెనల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

హంద్రీనీవా ప్రధాన, ఉపకాలువల నిర్మాణంలో భాగంగా చాలా మంది రైతులు భూమిని కోల్పోయారు. కృష్ణా జలాలు వచ్చాక మిగిలిన భూమిలోనైనా సాగు చేసుకోవచ్చని ఆశపడ్డారు. ఇప్పటికీ వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. పొలాల మీదుగా తవ్విన పిల్ల కాలువలు ఇప్పటికే చాలావరకు కనుమరుగయ్యాయి. హంద్రీనీవా పథకం కింద ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కళ్లెదుటే ప్రధాన కాలువలో నీరు ప్రవహిస్తున్నా పొలాలకు నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవా పథకం పూర్తయితే ఉరవకొండ, కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలో 80 వేల ఎకరాలకు సాగు నీరు, జిల్లావ్యాప్తంగా 10 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం

ఇదీచదవండి.

HIGH COURT : రాజధాని వ్యాజ్యాలపై నేడు విచారణ

ABOUT THE AUTHOR

...view details