అనంతపురం జిల్లాలో 20 ఏళ్లుగా వేరుశనగ రైతులు ఛిద్రమవుతున్నారు. సాగు చేసిన పంటలు చేతికి రాక పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు ఊరించినా... వరుణుడు మళ్లీ కనిపించక... పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు, వజ్రకరూర్, ఉరవకొండ మండలాల్లో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. అన్నదాతలు కంటికి రెప్పలా కాపాడిన పంటలు ఎండిపోవడంతో... తొలగిస్తున్నారు. విత్తువేసే సమయంలో వచ్చిన వర్షాలు.... పంట పెరిగిన తర్వాత రాకపోవడంతో పంట మొత్తం వాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడినా లాభం లేదని.. ఇప్పుడే పంట తొలగిస్తే కనీసం పశువులకు దాణా మిగులుతుందని అన్నదాతలు వాపోతున్నారు. చీకలగుర్కి గ్రామంలో ఒకే రోజు దాదాపు వంద ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు తొలగించారు. తమకు పక్కనే వెళ్తున్న హంద్రీనీవా కాలువ ద్వారా బ్రాంచ్ కెనాల్ ఏర్పాటు చేశారని... కానీ... నీరు అందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నీరు అందిస్తే కనీసం కొద్ది మంది రైతులకైనా న్యాయం జరిగేదంటున్నారు.