అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదారులపల్లి గ్రామంలో పాఠశాల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గత 71 రోజులుగా పాఠశాల ముందు గ్రామానికి చెందిన విద్యార్థులు తమ పాఠశాలను పక్కనే ఉన్న బసాపురం గ్రామంలో విలీనం చేయకూడదని పాఠశాల గేటుకు ముళ్లకంచె వేసి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. వీరికి పలుమార్లు కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ ఉమా మహేశ్వర నాయుడుతో పాటు సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పై తీవ్ర ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఇక చేసేదేెంలేక ప్రభుత్వం బసాపురం పాఠశాలలో మాయదార్లపల్లి పాఠశాలను విలీనం చేసే ప్రక్రియను నిలిపివేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ పాఠశాల విద్యార్దులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సుదీర్ఘం పోరాటం ఫలించిందని.. గ్రామస్తులు సైతం ఆనందం వెలిబుచ్చారు.
ఫలించిన విద్యార్థుల సుదీర్ఘ పోరాటం.. పాఠశాల విలీన నిర్ణయం ఉపసంహరణ - అనంతపుర్ స్కూల్ న్యూస్
తాము చదువుకుంటున్న పాఠశాలను వదిలి, కి.మీ ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయంపై.. ఆ విద్యార్థులు సుదీర్ఘ నిరసనను చేపట్టారు. అంత దూరం వెళ్లలేమని, పరిస్థితి ఇలాగే ఉంటే చదువులు మానేస్తామని విద్యార్థులందరు ఏక గొంతుక వినిపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వారి పోరాటానికి తలొగ్గింది. ఆ పాఠశాల విలీనాన్ని నిలుపుదల చేస్తూ..ఆదేశాలు జారీ చేసింది. దీంతో , 71 రోజులుగా నిరసన చేస్తున్న అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదారులపల్లి గ్రామం పాఠశాల విద్యార్థులు ఇప్పుడు హాయిగా తమ చదువులు కొనసాగిస్తామని చెబుతున్నారు.
పాఠశాల విలీన నిర్ణయం ఉపసంహరణ
Last Updated : Oct 22, 2022, 1:15 PM IST