Govt Teacher Suicide Attempt Case: ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం కేసును పక్కదోవపట్టిస్తున్న పోలీసులు - ఆర్థిక ఇబ్బందులంటూ కొత్త కథ Govt Teacher Suicide Attempt Case: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యకు యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయుడు మల్లేశ్ ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారు. మల్లేశ్‌కు సీఎం జగన్ అంటే విపరీతమైన అభిమానం. వైసీపీ ప్రభుత్వం వస్తే సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తానన్న హామీతో మరింత ఇష్టం పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన మల్లేశ్‌కు నాలుగున్నరేళ్లుగా నిరాశే మిగిలింది.
సీపీఎస్ రద్దుపై తోటి ఉపాధ్యాయులు మల్లేశ్‌ను ఆటపట్టిస్తుంటే మరో ఆరు నెలల్లో జగన్ ప్రకటన చేస్తారని చెపుతూ వచ్చేవారు. చివరకు మల్లేశ్‌కు ఆశ చచ్చిపోవటంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే పోలీసులు కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీచర్ మల్లేశ్ ఆత్మహత్యాయత్నం- వైసీపీ తీరుపై భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు
మల్లేష్ చెల్లెలి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం కోసం 26 లక్షల రూపాయలు అప్పుచేశారని చెబుతున్నారు. ఆసుపత్రిలోనే మల్లేశ్‌ను చూసుకోటానికి వచ్చిన ఆయన సోదరి, బావమరిదిని సీఐ చెప్పిన విషయంపై అడగ్గా తమకు ఎపుడైనా ఐదు నుంచి పదివేలు మాత్రమే ఇచ్చేవాడని, ఇప్పటివరకు తాము తీసుకున్నదంతా లక్ష రూపాయలకు మించదని చెబుతున్నారు.
అనంతపురం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న టీచర్ మల్లేశ్‌ను తెలుగుదేశం నేత కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. సీఎం జగన్ ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేశారని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ని ఉపాధ్యాయుడు మల్లేశ్ ఎంతో అభిమానించే వారని తెలిపారు. జగన్ మోసపు హామీల వలనే ఆత్మహత్యాయత్మం చేశాడని అన్నారు.
ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం - తన చావుకు సీఎం జగనే కారణమంటూ లేఖ
"నిన్నటి నుంచి స్పృహలో లేడు. ఈ రోజు ఉదయం కొంచెం స్పృహలోకి వచ్చిన తరువాత విచారించాం. తన కుటుంబ అవసరాల కోసం, తన చెల్లెలు కుటుంబ అవసరాల కోసం సుమారుగా 26 లక్షల రూపాయలు అప్పు చేశాడని తెలిసింది. ఆ అప్పులను తీర్చడం కోసం ఒక బ్యాంకు లోన్, దానిని తీర్చడం కోసం మరో బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. అలా వేర్వేరు దగ్గర అప్పు చేయడం వలన అవి ఎక్కువ అయ్యాయి. వాటిని తీర్చడానకి ఇబ్బంది పడుతూ ఈ పరిస్థితికి వచ్చాను అని చెప్పాడు". - తిమ్మయ్య, ఉరవకొండ సీఐ
"లక్షల రూపాయలు అని పోలీసుల విచారణ తేలింది అంటే అది అబద్ధం. మాకు లక్షో, 50 వేలు రూపాయలో సాయం చేశాడు. అంతే కానీ ఇంకేమీ చేయలేదు. మా పిల్లలు కూడా మామూలు స్కూల్లోనే చదువుతున్నారు. మా పిల్లలు ఫీజులు కూడా వారు ఏం కట్టలేదు". - ఆదినారాయణ, మల్లేశ్ బావమరిది
"ఆర్థిక సమస్యలు ఏంటో నాకు ఏం తెలియదు. ఏదైనా కావాలంటే తీసుకునే దానిని కానీ ఇవన్నీ నాకు తెలియదు. ఇంకా యాప్స్ గురించి కూడా నాకు తెలియదు". - శివలక్ష్మి, మల్లేశ్ భార్య