వ్యక్తుల ఆలోచన విధానమే వారి జీవన గమనంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సరైన విద్య వ్యక్తిని సన్మార్గంలో ఆలోచింపచేసేలా చేస్తుందని తెలిపారు. విమర్శనాత్మక ఆలోచన మన నిర్ణయాలను ప్రశ్నించుకోవటానికి.. మన మనచుట్టూ ఉన్న వ్యక్తులను నిష్పక్షపాతంగా చూడటానికి సహాయపడుతుందన్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవం వేడుకల్లో గవర్నర్ కులపతి హోదాలో విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ విధానంలో ప్రసంగించారు.
సమగ్ర విద్య మంచి ఆలోచనలను పెంపొందించటానికి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని సాధించటానికి దోహదపడుతుందని అన్నారు. విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఒత్తిడి రహిత, సురక్షితమైన ప్రాంతాల వంటివని తెలిపారు. విజయం, పురోగతి సులభంగా సమకూరేవి కాదన్న గవర్నర్.. వాటిని సాధించటానికి వేసే తొలి అడుగు సైతం కష్టతరంగానే ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
జీవన పోరాటంలో ప్రతిదీ విలువైనదే..
విశ్వవిద్యాలయం నుండి బయటకు అడుగు పెడుతున్న తరుణంలో సాగే జీవన పోరాటంలో ప్రతిదీ విలువైనదే అవుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడానికి సంసిద్దులు కావాలన్నారు. స్నాతకోత్సవం ద్వారా పట్టాలు పొందిన ప్రతీ విద్యార్థి తమ వృత్తిలో ఎదగడానికి.. జాతి అభివృద్ధికి దోహదపడటానికి తమ నైపుణ్యాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మీరు ఎంచుకున్న వృత్తిలో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత, ప్రతిభను విశ్వవిద్యాలయం అందించిందని తెలిపారు.
కష్టపడి సంపాదించిన జ్ఞానం మీ జీవితాన్ని సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. వెనకబడిన ప్రాంతాన్ని విద్యాపరమైన పురోభివృద్ది ద్వారా ముందుకు నడిపించేందుకు.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్విరామంగా కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గవర్నర్ను శాలువా అందించి మెమొంటో బహూకరించారు.
ఇదీ చదవండి:A Woman Story: ఆమె అతనికి వెన్ను...ఆ కుటుంబానికి దన్ను