Govt lands occupied by ysrcp leader relative : అనంతపురం జిల్లా గుత్తిలో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులు మింగేస్తున్నారు. వైకాపా ప్రజాప్రతినిధి బావమరిది కొండలను తవ్వేసి కోట్ల రూపాయలు మట్టి అమ్మేసుకున్నారు. కొండను తవ్వేశాక ఆ స్థలాన్ని చదును చేసి.. ఏకంగా వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులను కూడా పీకేసి కబ్జాపర్వం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 250 కోట్ల విలువైన వంద ఎకరాలను అక్రమంగా గుప్పిట పట్టినట్లు సమాచారం. కొండలను ఆనుకునే రెండు జాతీయ రహదారులు వెళ్తుండటంతో.. ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది.
జగనన్న కాలనీలకు మట్టి తవ్వకం పేరిట తొలుత అక్రమ దందాకు తెర లేపారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. వందల ట్రాక్టర్ల మట్టి విక్రయించి కోట్ల రూపాయలు గడించారు. ఆ తర్వాత తన అనుచరులను రంగంలోకి దించిన ప్రజాప్రతినిధి బావమరిది.. మట్టి తొలగించిన ప్రాంతంలోని స్థలాల్లో కంచె వేయించేందుకు స్తంభాలు పాతించారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. వీటిని ఏమాత్రం లేక్కచేయని వైకాపా నేతలు.. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. చెప్పిన ధరకు వాళ్ల వద్దే మట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని జగనన్న ఇంటి లబ్ధిదారులు వాపోతున్నారు.