Lack of Facilities in Government Hospitals: అనంతపురంలోని సర్వజనాసుపత్రిలో బాలింతలకు ప్రభుత్వం కనీసం పడకలు కూడా సమకూర్చలేకపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేదలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రే ఆధారం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచీ క్లిష్టమైన కేసులు జిల్లా ఆస్పత్రికే పంపుతుంటారు.
ఆసుపత్రి ప్రసూతి విభాగంలో నాలుగు వార్డులు ఉండగా, ఒక్కో వార్డులో 30 పడకల చొప్పున 120 పడకలు మాత్రమే ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద గర్భిణీలతో ఇక్కడ 240 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. దీంతో ఒక్కో మంచాన్ని ఇద్దరికి కేటాయిస్తున్నారు. కనీసం తాత్కాలిక పడకలు కూడా ఏర్పాటు చేయకపోవటంతో సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న బాలింతలు సైతం అనేక అవస్థలు పడుతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు చాలీచాలని మంచాలంతో బాలింతల ఇబ్బందులు రెట్టింపయ్యాయి.
ఇటీవల వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిఅనంతపురం ఆసుపత్రిని సందర్శించినా.. రోగులు తక్కువగా ఉన్న వార్డులు, ఐదేళ్ల క్రితం కొత్తగా నిర్మించిన చిన్నారుల వార్డును మాత్రమే మంత్రి పరిశీలించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రసూతి వార్డును కనీసం చూడకుండా వెళ్లిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకోండంటూ గొప్పగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రసూతి విభాగంలో మంచాల మరమ్మతులు కోసం దాతలు ముందుకు రావటానికి సిద్ధంగా ఉన్నా.. స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కో నివ్వదన్న చందంగా అనంతపురం సర్వజనాసుపత్రిలో బాలింతల కష్టాలు తీరటంలేదు.
"రెండు పడకలపై ముగ్గురు సిజేరియన్స్ను పడుకోబెడుతున్నారు. వాష్ రూమ్స్ కూడా సరిగా లేవు. సౌకర్యాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము." - రిజ్వాన, బాలింత బంధువు
"ఒక పడకపై ఇద్దరు గర్భణీలను, చిన్నపిల్లలను పడుకోబెడతున్న దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఇటీవలే వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ వచ్చి.. అనంతపురం జిల్లాలను పరిశీలించినా.. హాస్పిటల్లో సౌకర్యలపై శ్రద్ధ పెట్టలేదు. కనీసం పేషెంట్‌కు ఒక పడకను ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవటం వల్ల పేషెంట్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పడకలన్నీ శిథిలావస్థలో పడేసి.. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు సరైన సౌకర్యాలు అందించకుండా.. దౌర్భాగ్య స్థితిలో పడేస్తున్నారు." - విశాలాక్షి, రాష్ట్ర గాండ్ల కార్పోరేషన్ మాజీ ఛైర్మన్
"గర్భిణీలు, బాలింతలు ఈ ఆస్పత్రిలో నకరం అనుభవిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన గర్భిణీలు, బాలింతలు ఇక్కడికి చికిత్స మేరకు వస్తారు. ఈ ఆస్పత్రికి వచ్చిన పేషెంట్స్.. సౌకర్యాల లేమితో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో 120 పడకలు ఉంటే.. దాదాపు 240 మంది పేషెంట్స్ వాటిపైనే ఉంటున్నారు. ఇలా అరకొరవ సౌకర్యాలతో సరైన వైద్య సేవలు అందించటంలో ప్రభుత్వం విఫలమైంది." - జాఫర్, సీపీఐ కార్యదర్శి
ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల లేమి ఇవీ చదవండి: