8 people tried to occupy the land: గ్రామీణ సీఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన గుండాల నారాయణప్ప 2016లో మృతి చెందాడు. ఇతనికి 40 ఎకరాల భూమి ఉంది. దాని విలువ దాదాపు రూ.8కోట్లు. అతనికి నలుగురు కూతుర్లు సంతానం. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. దీనిని అదునుగా భావించి అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్ సీతారాముడు, నారాయణ అనే వ్యక్తులు.. మృతి చెందిన గుండాల నారాయణప్ప పేరుతో 2015లో రూ.5లక్షలు అప్పు ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోటును రాసుకున్నారు. ఆ అప్పు చెల్లించాలని వారే ఉరవకొండ కోర్టులో దావా వేశారు. దానికి సంబంధించిన నోటీసులు మృతుని భార్యకు వెంకటలక్ష్మమ్మకు, కూతుర్లకు అందకుండా చేసి, వారు కోర్టుకు రాలేదన్న కారణంతో ఆ భూమిని కోర్టు ద్వారా ఏకపక్షంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన మృతుని కూతురు 'సరితశైలజ' ఆ సంతకాలు తన తండ్రివి కాదని బ్యాంకు, చెక్కులు, గ్యాస్ అనుమతి పత్రాల్లోని సంతకాలను సాక్ష్యంగా చూపిస్తూ, కోర్టు పంపిన నోటీసులే తమకు అందలేదనే విషయాన్ని గుత్తి కోర్టులో తెలిపింది. దానిని పరిశీలించిన కోర్టు ఆ ప్రక్రియ నిలిపివేసింది.
నిందితుల బంధువులైన బళ్లారికి చెందిన రంగనాథ్ రూ.9.57లక్షలకు 7.02 ఎకరాలు, లోకేష్ రూ.17.22లక్షలకు 6.71 ఎకరాలు మృతుని భార్య వెంకటలక్ష్మమ్మతో కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నగదును చెల్లించినట్లు ఆమె ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్లను సృష్టించి, తమకు ఆమె భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదని కోర్టును ఆశ్రయించారు. దీనిని గుర్తించిన మృతుని కూతురు సరితశైలజ ఆ అగ్రిమెంటులో ఫోర్జరీ సంతకాలంటూ కోర్టు ద్వారా అడ్డు పడింది. అంతేకాకుండా వారు రాసుకున్న అగ్రిమెంటు కాగితాలు తయారైన తేదీ, స్టాంప్ వెండర్‌కు విక్రయించిన తేదీలను కోరుతూ అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహ చట్టం ద్వారా సంప్రదించింది. ఇక్కడ విస్తుపోయే నిజం బయటికి వచ్చింది. వారు కొన్న నాలుగు అగ్రిమెంటు కాగితాలు 2018 ఏప్రిల్ 2లో నాసిక్‌లో ముద్రితమయయ్యాయి. అవి అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయానికి 2018 సెప్టెంబరులో రాగా, అదే ఏడాది నవంబరు 24న అనంతపురంకు చెందిన స్టాంప్ వెండర్ అమీదాభనుకు రిజిస్ట్రేషన్ అధికారులు విక్రయించారు. అయితే నిందితులు అగ్రిమెంటు కాగితాలు నాసిక్‌లో ముద్రితమైన రోజే రాసుకున్నట్లు, ఫోర్జరీ సంతకాలతో వాటిని సృష్టించుకున్నారు. దీంతో నిందుతులు అక్రమానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిరూపితమైంది.