అనంతపురం: గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
12:50 August 20
ANANTAPURAM BREAKING
గుప్త నిధుల కోసం చారిత్రక ప్రదేశాలు, పురాతన ఆలయాలు ధ్వంసం చేస్తున్న వేటగాళ్లను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కనగానపల్లి, రొద్దం, యాడికి పోలీసులు గుప్త నిధుల వేటగాళ్లపై కొంతకాలంగా నిఘాపెట్టి, రాత్రివేళల్లో తవ్వుతుండగా మూడు చోట్ల 18 మందిని పట్టుకున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న భూమిలో ఖనిజాలను గుర్తించే ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసిన ముఠాలు రాత్రివేళల్లో ఎంపిక చేసిన చారిత్రక ప్రదేశాలు, పురాతన ఆలయాలకు వెళ్లి తవ్వకాలు చేస్తున్నారు. ఆలయాల్లో మూలవిరాట్ విగ్రహం కింద లోతైన గోతులు తీస్తున్నారు.
అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల ఏలుబడిలోని అనేక చారిత్రక ప్రాంతాల్లో అనేక శాసనాలు ఉన్నాయి. ఈ ముఠా సభ్యులు వీటిని పెకలించి తవ్వకాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిపై నిఘా పెట్టిన పోలీసులు మూడు మండలాల్లోని పలుచోట్ల 18 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుప్తనిధుల వేటగాళ్ల నుంచి ఎనిమిది ద్విచక్ర వాహనాలు, రెండు జేసీబీలు, సెల్ ఫోన్లు, మెటల్ డిటెక్టర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొంతమంది అంతర్రాష్ట్ర గుప్తనిధుల వేటగాళ్లు కూడా ఉన్నట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు.
ఇదీ చదవండీ.. CURFEW EXTEND: సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు