ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతిమ యాత్రలోనూ.. అనంతమైన యాతన !

కరోనా మహమ్మారికి మనుషులే కాదు మానవత్వమూ బలైపోతోంది. కొందరు కరోనా మరణాల్లోనూ కాసులు లెక్కబెట్టుకుంటున్నారు. కొవిడ్‌తో మరణించిన వారికి దహన సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్న పరిస్థితులు. దీన్ని శ్మశాన వాటిక నిర్వాహకులు, అంబులెన్సు డ్రైవర్లు, యజమానులు అవకాశంగా మలుచుకుంటున్నారు. పేద, ధనిక తేడా లేకుండా అందరి నుంచి అందినకాడికి లాగేసుకుంటున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా చేసేది లేక సొమ్ము సమర్పించుకోవాల్సి వస్తోంది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.25 వేల వరకు ఖర్చవుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు.

అంతిమ యాత్రలోనూ.. అనంతమైన యాతన !
అంతిమ యాత్రలోనూ.. అనంతమైన యాతన !

By

Published : May 11, 2021, 11:23 AM IST

అనంతపురంలో..

అనంత నగరానికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. అక్కడ తన తల్లికి కరోనా సోకడంతో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని నగరంలోని హరిశ్చంద్రఘాట్‌కు తీసుకురావడానికి అంబులెన్సుకు రూ.12 వేలు చెల్లించారు. శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి రూ.11 వేలు ఇచ్చారు. కాపటి కాపరి మామూళ్లు, ఇతరత్రా కలుపుకొని మృతదేహాన్ని దహనం చేయడానికి రూ.25 వేలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

గుంతకల్లులో..

‘గుంతకల్లుకు చెందిన ఓ వ్యక్తి అనంత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని అక్కడ నుంచి 2 కి.మీ. దూరంలో గుత్తి రోడ్డులోని శ్మశానవాటికకు తరలించడానికి కుటుంబ సభ్యులు అంబులెన్సుకు రూ.8 వేలు చెల్లించారు. శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలకు రూ.11 వేలు తీసుకున్నారు. అలాగే మృతదేహాన్ని అంబులెన్సులో నుంచి కిందకు దింపడానికి రూ.3 వేలు, శ్మశాన వాటికలోకి తీసుకెళ్లడానికి మరో రూ.4 వేలు డిమాండ్‌ చేశారు. కుటుంబ సభ్యులు చేసేదిలేక అడిగినంత ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాడిపత్రిలో..

‘తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఇబ్బంది పడుతూ రెండు రోజుల కిందట మరణించారు. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి పట్టణంలోని ఆరో రోడ్డులో ఉన్న శ్మశానవాటికకు తరలించడానికి అంబులెన్సు డ్రైవర్‌ రూ.4 వేలు డిమాండు చేశాడు. చేసేది లేక ఆయన భార్య సొమ్ము ఇచ్చి భర్త మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లింది. అక్కడ దహనం చేయడానికి కాటికాపరి రూ.8 వేలు డిమాండు చేశాడు. తన దగ్గర అంతడబ్బు లేదని రూ.2 వేలు ఇస్తానని చెప్పినా వినలేదు. చివరకు ఆమె తన తాళిబొట్టును తీసి ఇస్తే కాని దహన సంస్కారాలు నిర్వహించలేదు.’

అయిదు రెట్లు అధికం

కరోనా సంక్షోభం పేరిట శ్మశాన వాటికల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి రూ.3 వేలు తీసుకునేవారు. ఇప్పుడు రూ.11 వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది సవరించిన ఛార్జీల ప్రకారం రూ.5,200 వేలు చెల్లించాలి. కానీ కొందరు నిర్వాహకులు మాత్రం రూ.11 వేలు వసూలు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతుల కుటుంబ సభ్యులకు రెండు రశీదులు ఇస్తున్నారు. దీనికితోడు శ్మశాన వాటిక వద్ద అంబులెన్సు నుంచి మృతదేహాన్ని దింపడానికి రూ.3 వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. గేటు వద్ద నుంచి శ్మశానంలోకి తీసుకెళ్లడానికి రూ.4 వేలు తీసుకుంటున్నారు. కాటి కాపరికి రూ.2 వేలు. ఇలా వివిధ రూపాల్లో రూ.25 వేల దాకా వసూలు చేస్తున్నారు.

అంబులెన్సు ధరలు ఆకాశానికి..

కరోనా రెండో దశలో మరణాలు పెరిగిపోయాయి. కరోనా మృతదేహాలను తరలించడానికి అంబులెన్సులు తగిన సంఖ్యలో లేకపోవడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు అంబులెన్సు యజమానులు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. అనంత నగరంలోని ఏదైనా ఆసుపత్రి నుంచి దగ్గరలోని శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించాలంటే రూ.4 వేల నుంచి రూ.8 వేలు డిమాండ్‌ చేస్తున్నారు. అదే నగర పరిధి దాటి మండలానికి తీసుకెళ్లాలంటే రూ.20 వేలు చెల్లించాల్సిందే. అవకాశం, బాధితుల అమాయకత్వాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. కొంతమంది అంబులెన్సుల డ్రైవర్లు కిలోమీటరుకు రూ.4 వేలు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం - గంధం చంద్రుడు, కలెక్టర్

కరోనా మృతదేహాలను శ్మశానాలకు తరలించడానికి ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లు, యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే శ్మశాన వాటికల్లో అంత్యక్రియలకు నిర్ణయించిన ధరలే వసూలు చేయాలి. ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలి.

రూ.5,200 మాత్రమే చెల్లించాలి

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి రూ.5,200 మాత్రమే వసూలు చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేశాం. ఛార్జీలకు సంబంధించి అందరికీ సమాచారం తెలిసేలా శ్మశాన వాటికల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి తగిన చర్యలు తీసుకుంటాం. కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలి.

- వీవీఎస్‌ మూర్తి, కమిషనర్, నగర పాలక సంస్థ

ఇవీ చూడండి :రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు

ABOUT THE AUTHOR

...view details