"లక్ష రూపాయలు చెల్లించండి... ప్రతినెలా 30 వేల వడ్డీ పొందండి".. అనంతపురం జిల్లాలో ఎంతోమంది అమాయకులను ఆకట్టుకున్న ఈ ఆఫర్... తమదాకా రానివారు సంతోషించాల్సిందే. ఎందుకంటే అధిక వడ్డీకి ఆశపడి... జీవితాంతం సంపాదించిందే కాకుండా, అప్పులు తెచ్చిమరీ పెట్టుబడి పెట్టి నిండా మునిగిపోయిన వాళ్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
ఈ-బిడ్ ఫైనాన్స్ సర్వీసెస్ పేరుతో వెలసిన ఓ బోగస్ సంస్థ... లక్ష రూపాయలు చెల్లిస్తే నెలకు 30 వేలు వడ్డీ ఇస్తామంటూ ప్రచారం చేసింది. చెప్పినట్లుగానే కొన్ని నెలలపాటు వడ్డీ చెల్లించింది. ఈ విషయం ఆనోటా, ఈనోటా తెలుసుకున్న ఎంతోమంది... అధికమొత్తంలో పెట్టుబడులు పెట్టారు. దండిగా వసూలు చేసుకున్న కంపెనీ ప్రతినిధులు... ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. "ఆడిట్ జరుగుతోంది... అయ్యాక ఇస్తాం. కరోనా కేసులు పెరిగాయి వ్యాపారానికి నష్టం వచ్చింది" వంటి సాకులతో వడ్డీలు ఎగ్గొట్టిన ఆ సంస్థ... ఆ తర్వాత అసలు డబ్బులూ ఎగ్గొట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు... మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ కంపెనీ పేరుతో వ్యవహారం నడిపిన మోసగాళ్లు... గతంలో ఆ సంస్థలో ఉద్యోగం మానేసిన వారేనని తెలుస్తోంది. తొలుత బెలుగుప్ప నుంచి మొదలైన వడ్డీ చెల్లింపు పథకం... అక్కడి సర్పంచ్ బంధువుల ప్రచారంతో ఊరూరా పాకింది. క్రమంగా జిల్లా అంతటా విస్తరించింది. అనంతపురం, ధర్మవరం, బెలుగుప్ప, తాడిపత్రి సహా పలు మండలాలకు చెందిన ప్రజలు... లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. స్నేహితులు, బంధువులకూ చెప్పి... వాళ్లతోనూ పెట్టించారు. కొందరైతే ఏకంగా బంగారం కుదవపెట్టి, అప్పులు తెచ్చి డబ్బులు కట్టారు. తొలుత కచ్చితంగా 30 వేలు చెల్లిస్తూ వచ్చిన మోసగాళ్లు... తర్వాత కల్లబొల్లి కథలు చెప్పి 20 వేలకు తగ్గించారు. ఇది మోసం అని ప్రజలంతా తెలుసుకునేలోపే... వసూలు చేసిన డబ్బులతో ఉడాయించారు.