ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఉద్యోగాల పేరిట మోసాలు...! నిత్యం ఎక్కడో చోట జరిగే నేరమే ఇది. బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇలాంటి కేసు దర్యాప్తునే ప్రారంభించిన అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. బాధితులు పేర్కొన్న నిందితుడు.. 3 రోజుల క్రితమే కరోనాతో మరణించాడు. ఈ మోసాల వెనుక అతనితో పాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూపీ లాగుతున్నారు.

రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం
రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

By

Published : May 24, 2021, 6:59 PM IST

రైల్వే ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘరానా మోసం బయటపడింది. దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌లో ఉద్యోగాల పేరిట మోసపోయామంటూ చెన్నైకి చెందిన 12 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నియామక పత్రాలు అందచేసి లక్షలు కాజేశాడంటూ గుంతకల్లులోని ప్రశాంతి నగర్‌కు చెందిన విజయ్ స్టాన్లీపై ఆరోపణలు చేశారు. అతనిచ్చిన నియామక పత్రాలు పట్టుకుని కార్యాలయానికి వెళ్లామని.. తమకు వైద్య పరీక్షలూ చేశారని బాధితులు చెబుతున్నారు. పరీక్షలన్నీ అయ్యాక అవి అసలైనవి కాదని ఈ నకిలీ దందాకు సంబంధించి అధికారులు ఓ వార్తను విడుదల చేశారంటున్నారు. రైల్వే పోలీసులను బాధితులు ఆశ్రయించగా.. నిందితుడు విజయ్ స్టాన్లీ రైల్వేలో సీనియర్ క్లర్క్‌గా పరిచయం చేసుకుని మోసగించినట్టు వారు గుర్తించారు.

నిందితుడి నివాసం తదితరాలన్నీ గుంతకల్లు అర్బన్ పోలీసు పరిధిలో ఉండటంతో కేసుని రైల్వే పోలీసులు అక్కడికి బదలాయించారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులకు.. నిందితుడు 3 రోజుల క్రితం కరోనాతో మరణించినట్టు తెలిసింది. ఈ మోసం వెనుక స్టాన్లీ ఒక్కడే ఉన్నాడా లేదా రైల్వే ఉన్నతాధికారులెవరైనా సాయం చేశారా అని తేల్చే పనిలో పడ్డారు. పత్రాల ధ్రువీకరణ, వైద్యపరీక్షలు పూర్తయ్యేదాకా ఈ మోసం బయటపడకపోవడం, పలుచోట్ల అధికారుల సంతకాలు ఈ నకిలీ నియామక పత్రాలపై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు ఎవరూ మోసపోవద్దని రైల్వే ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details