అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో కేటుగాళ్ల చేతిలో హైదరాబాద్‌కు చెందిన పుల్లారెడ్డి మోసపోయారు. 200 బంగారు నాణేలు ఉన్నాయని నమ్మబలికిన దుండగులు.. 8 లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. అసలు సంగతిని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు పుల్లారెడ్డి.. బెలుగుప్ప ఎస్సై శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన పుల్లారెడ్డి అనే వ్యాపారికి... బెలుగుప్పకు చెందిన కొంతమంది పరిచయం అయ్యారు. తమ వద్ద బంగారు నాణేలు ఉన్నాయని నమ్మబలికి వాటిని తక్కువ ధరకు ఇస్తామని చరవాణి ద్వారా పుల్లారెడ్డిని సంప్రదించారు. నాణేలు తీసుకునేందుకు అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం పరిధిలోని గుండ్లపల్లి వద్దకు రమ్మన్నారు. పుల్లారెడ్డి ఆ కేటుగాళ్లకు ఎనిమిది లక్షలు ఇచ్చి.. నాణేలు తీసుకున్నాడు. అందులో ఒక వ్యక్తి హైదరాబాద్ వరకు వస్తానని... అడగ్గా పుల్లారెడ్డి తన కారులో ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే వాహనాన్ని ఆపమని చెప్పి ద్విచక్రవాహనంపై ఉడాయించాడు.