ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పినా.. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారు ' - illness of students in anantapur district

అనంతపురం గ్రామీణ మండలం కక్కలపల్లిలో విద్యార్థుల అస్వస్థతపై తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. ఐదు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పినా.. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని నిలదీశారు. అలాగే.. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Paritala Sunita
Paritala Sunita
author img

By

Published : Mar 11, 2022, 8:59 PM IST

Updated : Mar 12, 2022, 4:43 AM IST

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. అనంతపురం గ్రామీణ మండలం కక్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితమై 41 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించి, తలిదండ్రులకు ధైర్యం చెప్పిన పరిటాల సునీత.. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

విద్యార్థులు చెప్పినా...
ఐదు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పినా.. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని పరిటాల సునీత ధ్వజమెత్తారు. చైనాలో పురుగులు తింటారు.. మీరూ తినండని చిన్నారులకు టీచర్లు చెప్పారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా, ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపించటం వల్లనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందటం లేదన్నారు.

ఆ బాధ్యత నాది..
విద్యార్థులకు అవసరమైతే ప్రైవేట్ వైద్యం అందించాలని.. ఆ బాధ్యత తాను తీసుకుంటానని పరిటాల సునీత వైద్యులకు చెప్పారు. భాజపా జిల్లా అధ్యక్షుడు సందడి శ్రీనివాసులు ఆ పార్టీ నాయకులతో కలిసి ఆసుపత్రిలో చిన్నారులను పరామర్శించి.. వైద్యులతో మాట్లాడారు. పిల్లలకు అన్నం ఎందుకు..? చైనా తరహాలో పురుగులే తినిపించండంటూ ఓ విద్యార్థిని తల్లి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతపురం జిల్లా..
అనంతపురం జిల్లా కక్కలపల్లిలో 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. పాఠశాలలో తిన్న ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆస్పత్రిలోని పిల్లల వార్డు వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల తనిఖీపై డీఈవోను ప్రశ్నించారు.

ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్..
కక్కలపల్లిలో విద్యార్థుల అస్వస్థతపై డీఈవో అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను సైతం తొలగించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంపీ రంగయ్య పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్పాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో 100 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. ఉదయం పొంగలి తిన్న అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. సాయంత్రం ఏడో తరగతి విద్యార్థులు గీత, భాగ్యలక్ష్మిలను టెక్కలిలోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు అస్వస్థత

రాత్రి 8 గంటల సమయంలో మరో ముగ్గురు విద్యార్థులు లక్ష్మి, మహేశ్వరి, యుగంధర్​లను వారి కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తలనొప్పి, కడుపు నొప్పి లక్షణాలతో వీరంతా ఆస్పత్రిలో చేరారు. అయితే అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అయితే ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి :నంద్యాలలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Mar 12, 2022, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details