తెదేపా హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లకు జగన్ మోహన్ రెడ్డి పేరు ఎలా పెడతారంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన... పీఎంఏవై-ఎన్టీఆర్ పథకం కింద ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచితే వైఎస్సార్ జగనన్న నగర్ అని పేరు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే పీఎంఏవై-ఎన్టీఆర్ గృహాలు 77 వేలు పూర్తి చేశామన్నారు. మరో 41,600 ఇళ్లకు స్లాబ్లు పూర్తై చిన్నపాటి పనులు జరగాల్సి ఉందని, లక్షా 90 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన దివంగత సీఎం ఎన్టీఆర్ పేరు పెట్టిన గృహ సముదాయాలకు పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకోవటాన్ని ఆయన తప్పుబట్టారు.
' తెదేపా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు జగన్ పేరు ఎలా పెడతారు?' - టిడ్కో ఇళ్లకు జగన్ పేరుపై కాలవ శ్రీనివాసులు కామెంట్స్
తెదేపా ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లకు సీఎం జగన్ పేరు ఎలా పెడతారంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. తెలుగు ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఎన్టీఆర్ పేరు తీసేసి...జగన్ పేరు ఎలా పెడతారని నిలదీశారు. ఇళ్ల స్థలాల పంపిణీలో తెదేపా కోర్టుకెళ్లిందని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని ఐదు సార్లు పంపిణీని వాయిదా వేశారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఇంటి స్థలాలను పంపిణీ చేయటం చేతకాక తెదేపా కోర్టుకు వెళ్లిందని తమపై బురదచల్లే యత్నం చేశారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే దేశంలో ఏ పార్టీకూడా వద్దని చెప్పదన్నారు. వైకాపా ప్రభుత్వం తెదేపాపై తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో తెదేపాపై విమర్శలు చేసిన వైకాపా మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :సంకల్బాగ్ ఘాట్లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్