‘కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఓ కస్తూరిబా విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి వివాహమైంది. తిరిగి బాలిక కస్తూరిబాలో చేరి, విద్యను అభ్యసిస్తోంది. ఆ బాలిక గంటల తరబడి ఫోనులో మాట్లాడుతుండటాన్ని గమనించిన తోటి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.’
‘ఇటీవల పరిగి కస్తూరిబాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడం లేదని తేలింది. కుళ్లిన కాయగూరలతో వంట చేస్తున్నట్లు గుర్తించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదు. రాత పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేయలేదని తెలిసింది.’
‘కస్తూరిబాల్లో నిత్యావసర సరకులు సరఫరా చేయడానికి గతంలో సమగ్రశిక్ష కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. రూ.10.64 కోట్లలో టెండర్లు ఆహ్వానించారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని, తమకు అనుకూలమైన వారితోనే టెండర్లు వేయించారు. సరకుల సరఫరా ద్వారా లాభం పొందేందుకు ప్రజాప్రతినిధులు సహకరించినట్లు తెలుస్తోంది.’
అనంతపురంలో కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాల్లో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. విద్యార్థినులను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు ప్రత్యేక అధికారిణులు పట్టించుకోవడం లేదు. బాధ్యతను మరిచారు. భద్రతను విస్మరించారు. మెనూ ప్రకారం భోజనం అందివ్వకుండా వారి కడుపులు మాడ్చి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం సైతం పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. అడపాదడపా పరిశీలించినా ఎక్కడా చర్యలకు ఉపక్రమించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
లోపం ఎక్కడ?
కస్తూరిబాల్లో విశాలమైన భవనం, గదులు ఉన్నాయి. ప్రహరీ నిర్మించారు. రాత్రి కాపలాదారు ఉన్నారు. స్థానికంగా ఉండాల్సిన ప్రత్యేక అధికారులు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. దీంతో పర్యవేక్షణ పూర్తిగా పడకేసింది. ప్రతి విద్యాలయంలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. అయినా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఓ కేజీబీవీలో చదువుతున్న బాలికను బంధువు వెంట పంపగా వివాహం చేసుకున్నాడు. తాళిబొట్టు, మెట్టెలు కనిపించకుండా మళ్లీ విద్యాలయంలో చేర్పించారంటే ఏ మేరకు పర్యవేక్షణ ఉందో స్పష్టమవుతోంది. కస్తూరిబాల్లోకి కొందరు బాలికలు ఫోన్లు తీసుకెళ్లి గుట్టుగా మాట్లాడుతున్నారు. ఈ విషయంపై ఇద్దరు బాలికలకు టీసీలు ఇచ్చి ఇళ్లకు పంపారు. అలాగే గుడిబండ కస్తూరిబాలోకి రాత్రి వేళ ఓ వ్యక్తి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఇది సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టగా.. నాడు-నేడు పనులు చేపట్టిన మేస్త్రీ బిల్లుల కోసం వచ్చాడని ప్రత్యేకాధికారి వివరణ ఇచ్చారు.