అనంతపురంలో జిల్లాలో కొనసాగుతున్న వరదలు అనంతపురంలో భారీ వర్షాల ధాటికి వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. మడకశిర మండలం వై.బి.హళ్ళి గ్రామ చెరువు పొంగిపొర్లుతోంది. రెండు రోజులుగా ఆ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. పట్టణానికి రావాలంటే చుట్టూ గ్రామాలు చుట్టేసుకుని రావాల్సి వస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు.
భక్తరహళ్లి, జిల్లడగుంట గ్రామాల్లో సైతం వాగు ప్రవహిస్తోంది. పై నుంచి పెద్ద చేపలు వాగులో కొట్టుకు వస్తుండడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సైతం లెక్క చేయకుండా ప్రజలు వలలు వేసి చేపలు పడుతున్నారు.
తనకల్లు మండలం సింగిల్ వాండ్ల పల్లి వద్ద హంద్రీ-నీవా సుజల స్రవంతి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కోతకు గురై వర్షపు నీరు వృథా అవుతోంది. భారీ వర్షాల కారణంగా సిద్ధగురు పల్లి వద్ద, కదిరి పులివెందుల ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని నివాసాల్లోకి వరద వస్తోందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా మొద్దులు వేసి రాస్తారోకో చేపట్టారు.
కాగా.. పలు చోట్ల ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. భారీ వర్షాలతో నాలుగు రోజులుగా జలమయమైన ప్రాంతాల్లో క్రమంగా వరద నీరు తగ్గుతోంది. కదిరి నియోజకవర్గంలో వర్షప్రభావం తగ్గడంతో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
కదిరి- హిందూపురం ప్రధాన రహదారి పై మద్దిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నాలుగు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రవాహ వేగం నెమ్మదించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నడుస్తున్నాయి.
సచివాలయాలకు వరద ముప్పు..
బుక్కరాయసముద్రం మండల గోవిందపల్లి, నీలంపల్లి గ్రామాల్లో వాగులు, వంకల పక్కనే నిర్మిస్తున్న సచివాలయం,ఆర్బికే, ఆరోగ్య ఉప కేంద్ర భవనాలకు వరద ముప్పు పొంచి ఉంది. వాగులు, వంకల ప్రాంతాల్లో సచివాలయానికి, అర్బికే, ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మింస్తుండడం వల్ల ఈ భవనాల చుట్టూ వర్షం నీరు చేరాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆరోపించారు.
వరద ఇలాగే కొనసాగితే కార్యాలయాలు ప్రారంభించకుండానే దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చేనేత కార్మికులను పరామర్శించిన పరిటాల శ్రీరామ్..
ధర్మవరంలో వర్షానికి దెబ్బతిన్న చేనేత మగ్గాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. శివనగర్ ప్రాంతంలో చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయమూ అందలేదని కార్మికులు తెలిపారు. ఎన్టీఆర్ పరిటాల ట్రస్టు ద్వారా చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
నార్పల మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం కోసం ఉన్న పాత బ్రిడ్జి తొలగించారు. బ్రిడ్జి తొలగించడంతో పక్కన డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు దాదాపు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఎక్కువ రావడంతో డైవర్షన్ రోడ్డు వరద నీటికి కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డైవర్షన్ రోడ్డు కోతకు గురవడంతో అత్యవసర చికిత్స కోసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏమిటంటని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:BJP Leader Vishnu on Cyclone damage : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి - భాజపా