ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బురద, దుర్గంధం,విషపురుగులతో.. అనంత వరదబాధితుల ఆందోళన - ముంపు బాధితురాలు

Flood victims in Anantapur: అనంతపురం నగరంలో వరద ముంపు తగ్గినా, ప్రజలను బురద మాత్రం వదలటంలేదు. నడిమివంక ప్రవాహంతో ఇళ్లలో చేరిన బురదను వదిలించుకోటానికి ప్రజలు తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. గ్రామాలు,కాలనీల్లో బురదను తొలగించటానికి అగ్నిమాపకశాఖ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వరదతో పాటు వచ్చిన బురద వాసనతో అల్లాడిపోతున్నామని ముంపు ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Flood victims in Anantapur
అక్కడ వరద తగ్గినా... బురద పోవడం లేదు

By

Published : Oct 16, 2022, 10:02 AM IST

Floods in Anantapur: అనంతపురం శివారు కాలనీలను భయకంపితులను చేసిన వరద నుంచి బాధితులు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. నడిమివంక ఉద్ధృతి తగ్గి ముంపు వీడినా.. బురద మాత్రం తిప్పలు పెడుతోంది. ఇళ్లలో మేట వేసిన బురదను వదిలించుకోవడనికి నానా తంటాలు పడుతున్నారు. దీనికితోడు విషపురుగులు చేరి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మురుగుతో ముక్కుపుటాలు పగిలేలా వస్తున్న దుర్వాసనతో, జనం పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.

అనంతపురం శివారు కాలనీల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. నడిమివంక ఉద్ధృతి లోతట్టు ప్రాంతాలను కోలుకోలేని దెబ్బతీసింది. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న వంతెనలు, రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించేందుకు యంత్రాంగం పనులు చేపట్టింది. నడిమివంక ప్రవాహంతో రైల్వేస్టేషన్ నుంచి తపోవనం వెళ్లే మార్గంలో సోమనాథనగర్ వద్ద వంతెన కొట్టుకుపోయింది. ప్రధాన రోడ్డు కావడంతో మట్టి వేసి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు.

కాలనీల్లో ముంపు తగ్గినా బురద మాత్రం వదలట్లేదు. రోడ్లు, ఇళ్లలో రెండు అడుగుల మేర బురద మేటలు వేసింది. రోడ్లపై పేరుకుపోయిన బురదను యంత్రాల సాయంతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఇళ్లలోకి చేరిన బురద ఎత్తిపోసుకోలేక బాధితులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పురుగులు, పాములు చేరి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు.

బురదకు తోడు డ్రైనేజీ కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తూ స్థానికులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంట్లోకి వరద చొరబడి కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.భారీ వరదతో సర్వస్వం కోల్పోయిన ముంపు ప్రాంత బాధితులకు ప్రభుత్వం రెండు వేల రూపాయల ఆర్థిక సహాయంతోపాటుగా.. నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే, ఆర్థిక సహాయం చెక్కుల విషయంలో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండు వేల రూపాయల సహాయం చేయటానికి ఆధార్, రేషన్ కార్డు, ఓటరు కార్డు అంటూ అర్థం లేని నిబంధనలు పెట్టారని నిప్పులు చెరుగుతున్నారు. నిత్యావసరాల పంపిణీలో కూడా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద భారీగా వరసలో నిలబడిన బాధితులకు కొంతమందికి మాత్రమే సరుకులు ఇచ్చి, మిగిలిన వారిని వెనక్కు పంపించారు. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన బాధితులు అధికారుల తీరుపై మండిపడ్డారు.

''మురుగుతో పాటు వచ్చిన విషపురుగులు ఇళ్లలో చేరి రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపాము. ముక్కుపుటాలు పగిలేలా వస్తున్న దుర్వాసన వస్తోంది. ఇంటికి మూడు బిందెల చొప్పున ఇచ్చిన నీటితో ఇంట్లోని మురుగును వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వంక భారీ ప్రవాహంతో పలు కాలనీలను అనుసంధానం చేసే వంతెనలు కూలిపోయాయి. కాలనీల్లో బురద తొలగించే పనులు వేగవంతం చేయాలి.'' -ముంపు బాధితురాలు

అనంత ప్రజలను భయకంపితులనుచేసిన నడిమివంక వరదతో సర్వస్వం కోల్పోయిన పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వారు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో చేరిన బురదను తొలగించుకొని, సాధారణ జీవన పరిస్థితులు రావటానికే కనీసం నెలరోజులు పట్టే అవకాశం ఉందని బాధితులు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం శివారు కాలనీల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details