ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లెపోరుకు నోటిఫికేషన్.. మొదట పెనుకొండ డివిజన్‌లో ఎన్నికలు

పల్లె పోరుకు ఎన్నికల నగారా మోగడంతో అనంతపురం జిల్లా ఎన్నికల హడావిడి మొదలైంది. మొదటి దశలో జిల్లాలో పెనుకొండ డివిజన్​లోని 13 మండాలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ డివిజన్​లో మొత్తం 182 పంచాయతీలు.. 2,094 వార్డులు ఉన్నాయి. వీటికి గతంలోనే అధికారులు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వీడియో సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్​ కానీ ఇతర ఉన్నతధికారులు హాజరు కాకపోవడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

By

Published : Jan 24, 2021, 12:50 PM IST

first phase panchayat elections in penukonda
మొదట పెనుకొండ డివిజన్‌లో ఎన్నికలు

పల్లె పోరుకు నగారా మోగింది. తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రామ సీమల్లో హడావుడి ప్రారంభమైంది. ఎన్నికలకు సంబంధించి శనివారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో జిల్లాలో తొలిదశలో పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 25 నుంచి నామపత్రాల స్వీకరణ ప్రారంభమవుతుంది. 27న నామినేషన్ల గడువు ముగుస్తుంది. 31న ఉపసంహరణకు తుది గడువు విధించారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. తొలి దశలో 13 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

కలెక్టర్​, జేసీలు ఎక్కడ?

అధికారులు లేక ఖాళీగా ఉన్న కుర్చీలు

శనివారం కలెక్టరేట్‌ బోసిపోయింది. ఉన్నతాధికారులెవరూ హాజరుకాలేదు. ఇతర అధికారులు, సిబ్బందిలోనూ చాలామంది విధులకు రాలేదు. సాధారణంగా కలెక్టరు సెలవులో ఉంటే.. కనీసం ముగ్గురు జేసీల్లో ఒక్కరైనా కలెక్టరేట్‌కు హాజరయ్యేవారు. ఒక్కరు కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వీడియో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా అధికారులెవరూ హాజరు కాలేదు.

సమావేశాన్ని సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసినా అంతే. కలెక్టర్‌, జేసీలు, ఎస్పీ, పంచాయతీ అధికారి ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. ఎన్నికల సంఘానికి సహకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఉదయం నుంచే కలెక్టర్, జేసీలు క్యాంపు కార్యాలయాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టరేట్‌ బోసిపోయింది. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించే గదికి కూడా సాయంత్రం తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు.

మొదటి దశలో 13 మండలాలు.. 182పంచాయతీలు!

జిల్లాలో 63 మండలాల పరిధిలో 1044 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొదటి దశలో పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ డివిజన్‌లో 13 మండలాలు.. 182 పంచాయతీలు.. 2,094 వార్డులు ఉన్నాయి. వీటికి గతంలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. 182 పంచాయతీలకు గాను 98 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 35 (మహిళలు: 20, జనరల్‌: 15), ఎస్టీలకు 07 (మహిళలు: 5, జనరల్‌: 2), బీసీలకు 49 (మహిళలు: 25, జనరల్‌: 24), అన్‌రిజర్వుడ్‌ 91 (మహిళలు: 43, జనరల్‌: 48) స్థానాలు కేటాయించారు. వార్డులకు కూడా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి గెజిట్‌ను ప్రభుత్వానికి నివేదించారు. 2020 జనవరి 28న మేజర్‌ పంచాయతీగా ఉన్న పెనుకొండను నగర పంచాయతీగా ఉన్నతీకరించారు. సమీపంలోని కోనాపురం, వెంకటరెడ్డిపల్లి పంచాయతీలను అందులో విలీనం చేశారు. దీంతో ఆ రెండు పంచాయతీలు ఎన్నికలకు దూరమయ్యాయి.

క్రమం మొదటి దశ రెండో దశ మూడో దశ నాలుగో దశ
రెవెన్యూ డివిజన్​ పెనుకొండ కదిరి ధర్మవరం, కళ్యాణదుర్గం అనంతపురం
మండలాలు 13 12 8,11 19

అధికారుల తర్జనభర్జన..

జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జన పడుతున్నారు. ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ ప్రకటించిన నేపథ్యంలో అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకవేళ ఎన్నికలు తప్పనిసరైతే.. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం కష్టమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పరిశీలన, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ పూర్తయింది. ఉద్యోగుల విధులకు సంబంధించి అప్పట్లోనే జాబితాను తయారు చేశారు. అయితే వారిలో కొందరు పదవీ విరమణ పొందగా.. ఇంకొందరు బదిలీ అయ్యారు. దీంతో కొత్త జాబితా సిద్ధం చేయాల్సి ఉంది.

ఇదీ చదవండి:

4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details