అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని తాడంగిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిప్పేస్వామి అనే రైతు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం పొలం పనులకు వెళ్లి పోయారు. దేవుడి వద్ద పూజ కోసం వెలిగించిన దీపాలు నుంచి మంటలు వ్యాపించి ఇంట్లో విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. తాళం వేసిన ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు రైతుకు సమాచారం అందించారు .
దీపం వెలిగించి పొలానికి వెళ్లొచ్చేసరికి నష్టం జరిగిపోయింది - అనంతపురం అగ్ని ప్రమాద ఘటన
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజ కోసం వెలిగించిన దీపాలు అంటుకొని ఓ రైతు ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలంలో తాడంగిపల్లి గ్రామంలో జరిగింది. అగ్ని ప్రమాదంలో రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు విలపిస్తున్నారు.
హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్న బాధితుడు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అగ్నిమాపక కేంద్రం ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో తన కుమారుడు సుభాష్ కు చెందిన 10వ తరగతి మార్కుల జాబితా, భూమికి సంబంధించిన పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకం, రూ.5 వేల నగదు, బంగారం కాలిపోవటంతో రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:పోలీసు స్టేషన్ ఎదుట టమాట రైతుల ఆందోళన