ఏ గ్రామమైనా పచ్చని చెట్లతో కళకళలాడుతుంటాయి. ఎవరైనా ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా.. ఆ ఆహ్లాదకర వాతావరణానికి అలసట మరిచిపోతారు. కానీ అనంతపురం జిల్లా పరిగి మండలం ధనాపురం గ్రామంలో మాత్రం పరిస్థితి వేరు. ఆ గ్రామానికి ఎవరైనా రావాలంటేనే భయపడుతుంటారు. రోడ్డు పక్కనే మృతదేహాలను ఖననం చేస్తుండటంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు.
ధనాపురం గ్రామానికి దశాబ్దాల కాలం నుంచి శ్మశాన వాటిక లేదు. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని గ్రామానికి వచ్చి వెళ్లే రహదారి పక్కనే ఖననం చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా కొంతకాలం తర్వాత ఒక మృతదేహాన్ని పూడ్చినచోటే.. మరో మృతదేహాన్ని పూడ్చాల్సి వస్తోందని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.